V6 News

ముగిసిన రెస్క్యూ.. ట్రాక్ పునరుద్ధరణ పనులు షురూ   

ముగిసిన రెస్క్యూ.. ట్రాక్ పునరుద్ధరణ పనులు షురూ   

బాలాసోర్/న్యూఢిల్లీ:  రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ శనివారం మధ్యాహ్నం ముగిసిందని రైల్వేస్ అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుంచి బాధితులను తరలించేందుకు 200 అంబులెన్స్ లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లను ఉపయోగించినట్లు ఒడిశా అధికారులు తెలిపారు. సుమారు 1200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు అన్ని వాహనాలనూ వాడుకున్నామని పేర్కొన్నారు.    

44 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ 

రైలు ప్రమాద స్థలంలో 300 మంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ వెల్లడించారు. మెటల్ కట్టర్స్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్స్, హెవీ లిఫ్ట్ ఎక్విప్ మెంట్లతో వారంతా బాధితుల కోసం వెతికారని ఆయన తెలిపారు. లోకల్ పోలీసులు, రైల్వే సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 9 బృందాలుగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని, వీరిలో మహిళా సిబ్బంది, మెడికల్ టీమ్స్ కూడా ఉన్నట్లు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ల సభ్యులు 44 మందిని ప్రాణాలతో కాపాడారని, 71 మంది మృతదేహాలను వెలికితీశారన్నారు. ప్రధానంగా ధ్వంసమైన రైలు బోగీలను కట్ చేస్తూ, వాటిలో బతికి ఉన్న వారిని కాపాడటమే తమ సిబ్బందికి ఇచ్చిన మెయిన్ టాస్క్ అని తెలిపారు.

50 మందిని కాపాడిన స్థానికులు

రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఆ పరిసరాల్లో ఉన్న స్థానికులు పరుగుపరుగున వచ్చి ఎంతో మందిని కాపాడారు. బోగీల్లో నెత్తురోడుతున్న వారిని బయటకు తీసి సమీపంలోని దవాఖానకు తరలించారు. పోలీసులకు, రైల్వే సిబ్బందికి కొందరు సమాచారం ఇవ్వగా.. మరికొందరు బాధితులను బయటకు తీశారు. గాయపడిన వాళ్లను ఇంకొందరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు ఆపన్నహస్తం అందించారు. ‘‘శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిన స్థలానికి కొద్ది దూరంలోని ఓ టీ స్టాల్ వద్ద ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగుతున్నా. సడెన్ గా పెద్ద శబ్దం, కేకలు, అరుపులు వినిపించాయి. యాక్సిడెంట్ జరిగిందని గుర్తించిన మేమంతా పరుగెత్తుకుంటూ వెళ్లాం. పోలీసులకు, రైల్వే సిబ్బందికి ఫోన్ చేసి, బాధితులను కాపాడటం మొదలుపెట్టాం” అని రణజిత్ గిరి అనే స్థానికుడు మీడియాకు చెప్పారు. ‘‘మేం 50 మంది వరకూ ప్యాసింజర్లను కాపాడినం. మా వెహికల్స్ లోనే వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కొంతమంది వాళ్ల కుటుంబసభ్యులు, బంధువుల కోసం చూశారు. కానీ ఆ చీకట్లో మేం వారి కుటుంబసభ్యులను వెతకలేకపోయాం” అని ఆయన తెలిపారు. ‘‘నేను బ్లడ్ డొనేట్ చేసేందుకని ఆస్పత్రికి వెళ్లాను. కానీ 60 ఏండ్లు ఉండటంతో నా రక్తం తీసుకోలేదు. వెంటనే ఆస్పత్రికి వచ్చి రక్తం ఇవ్వాలంటూ నా కొడుకులు, బంధువులకు ఫోన్ చేశాను” అని అశోక్ బేరా అనే వ్యక్తి వెల్లడించారు. తన ఫోన్ తో కాల్స్ చేస్తూ బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చానని, వారిని ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపేందుకు ప్రయత్నించానని తెలిపారు. ప్రమాదంలో తల్లిదండ్రుల జాడ తెలియని ఇద్దరు చిన్నారులను కూడా ఆయన చేరదీశారు. వారిని పేరెంట్స్ చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.