న్యూఢిల్లీ: రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే శాఖ ‘కవచ్’ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఇది కొన్ని రూట్లలోనే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన రూట్ లో ‘కవచ్’ సిస్టమ్ అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించింది. ఒకవేళ ‘కవచ్’ ఉండుంటే, ప్రమాదం తప్పేదని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. కవచ్ సిస్టమ్ ను రైల్వే శాఖకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా ఆపేందుకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
ఇవీ ఉపయోగాలు..
- ‘కవచ్’ ఒకే లైన్ లో రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే గుర్తించి ఆపుతుంది.
- రెడ్ సిగ్నల్‌ను గుర్తించకుండా ముందుకెళ్లినా, ఓవర్ స్పీడ్, స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోయినా ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది.
- లెవల్ క్రాసింగ్ గేట్ల దగ్గర ఆటోమేటిక్‌గా హారన్ ఇస్తుంది.
- పట్టాలు బాగా లేనప్పుడు, పొగమంచు లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు లోకో పైలట్ ను అప్రమత్తం చేస్తుంది.

