- ఒక్కో అధికారికి రెండు, మూడు బాధ్యతలు
- అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి
- ఇంజినీరింగ్ విభాగంలో కొన్ని పోస్టుల కుదింపు
- రెవెన్యూలో ఎస్టేట్స్ విలీనం
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ విభజన తర్వాత మూడు కమిషనరేట్లలో అధికారులు, సిబ్బంది కొరత ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన సీఎంసీ, ఎంఎంసీలకు జీహెచ్ఎంసీ నుంచి 603 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. అంతకు ముందున్న లోకల్ బాడీల అధికారులు, సిబ్బంది ఉన్నా పరిధి విస్తరించడంతో విభాగాలు పెరిగాయి. దీంతో స్టాఫ్సరిపోని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఒక్కో అధికారికి రెండు, మూడు విభాగాల బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. జోనల్ కమిషనర్లకు కూడా అదనంగా అడిషనల్ కమిషనర్ల బాధ్యతలు ఇచ్చారు.
అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులను కుదించారు. విభజన తర్వాత జీహెచ్ఎంసీలో ఖాళీ అయిన పలు విభాగాలకు అడిషనల్కమిషనర్లను నియమించాల్సి ఉండగా, అధికారులు లేక పలువురు జోనల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. కొందరు అడిషనల్కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు రెండు నుంచి మూడు విభాగాల బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు.
అదనపు విధుల నిర్వహణ కారణంగా ఆఫీసర్లు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. రెవెన్యూ విభాగంలో ఎస్టేట్స్ ను విలీనం చేయడంతో, ఆస్తుల రక్షణ, పన్నుల వసూళ్లపై పట్టు తగ్గుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శానిటేషన్, హెల్త్, ఎలక్షన్స్, యూసీడీ వంటి కీలక విభాగాలకు కూడా పూర్తిస్థాయి అధికారులు లేరు. ఉన్నవారికే ఈ విభాగాలను అదనపు బాధ్యతల కింద అప్పగించారు. దీనిపై కొందరు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అదనపు బాధ్యతలు ఇలా..
జీహెచ్ఎంసీ ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ విభాగాలకు అడిషనల్కమిషనర్ గా ఉన్న అనురాగ్ జయంతి రాజేంద్రనగర్ జోన్ కు జోనల్ కమిషనర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్న ప్రియాంక ఆలకు హెల్త్ విభాగం అడిషనల్కమిషనర్ గా, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ కు శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రకళకి ఎలక్షన్ వింగ్ కు అడిషనల్కమిషనర్ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
జీహెచ్ఎంసీలోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ (యూసీడీ) వింగ్ కు అదనపు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఎన్ పంకజను జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించడంతో ఆమె బాధ్యతలను అడిషనల్కమిషనర్ మంగతాయారుకు అప్పగించారు. కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణకు అదనంగా అడిషనల్కమిషనర్ అడ్మిన్ బాధ్యతలు ఇచ్చారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో ప్రాజెక్ట్ విభాగానికి వేరుగా చీఫ్ ఇంజినీర్(సీఈ), మెయింటెనెన్స్ కి వేరుగా సీఈ ఉండేది. విభజన తర్వాత మూడు కార్పొరేషన్లకి ఈ రెండింటిని కలిపి ఒక సీఈనే నియమించారు.
ఆ రెండు కార్పొరేషన్లలో....
కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో అడిషనల్ కమిషనర్ల అవసరం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సైబరాబాద్ లో అడ్మిన్ అడిషనల్ కమిషనర్ గీతరాధిక, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, మల్కాజిగిరిలో అడ్మిన్ అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ మాత్రమే ఉన్నారు. జోనల్ కమిషనర్లు అయితే ఒక్కో మూడు జోన్లకి ముగ్గురు చొప్పున ఆరుగురు ఉన్నారు. అయితే అడిషనల్ కమిషనర్ల బాధ్యతలు జోనల్ కమిషనర్లకు అప్పగిస్తారా?లేదా కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తారా?అనేది వేచిచూడాల్సిఉంది.
