హైదరాబాద్, వెలుగు: బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం సిటీలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసేందుకు ఈద్గాల్లో తాగునీటి వసతి, షామియానాలు వంటి సదుపాయాలు కల్పించారు. బక్రీద్ బలిదానానికి ప్రతీక కావడంతో ముస్లింలు పెద్ద ఎత్తున మేకలు, గొర్రెలను బలి ఇచ్చే సంప్రదాయం ఉండగా.. పొట్టేలు, మేకల అమ్మకాలు జోరుగా కొనసాగాయి.
తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మేక, గొర్రె పొట్టేళ్లను తీసుకొచ్చి వ్యాపారులు అమ్మకాలు చేశారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో, సంతోషంగా నిర్వహించుకునేలా... అన్ని చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.