అధికార భాషా కమిటీలో మార్పులు

అధికార భాషా కమిటీలో మార్పులు

పార్లమెంట్​ వ్యవహారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు, హైకోర్టుల్లో కొన్ని ప్రత్యేక వ్యవహారాలకు సంబంధించి 1963, మే 10న అధికార భాషా చట్టం చేశారు. ఇది 1965 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇంగ్లిష్​, హిందీ భాషలు రెండూ కొనసాగుతాయి. ఈ చట్టం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఒక పార్లమెంటరీ అధికారిక భాషా కమిటీ నియామకమవుతుంది. ఆ ప్రాతిపదికన 1976లో అధికార భాషా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో లోక్​సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ కమిటీ తన నివేదికను ఇవ్వగా, రాష్ట్రపతి పార్లమెంట్​కు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తారు. 1996లో పహ్వా కమిటీ, 2003లో సీతాకాంత్​ మహాపాత్ర ఆధ్వర్యంలో భాషా కమిటీలు ఏర్పాటయ్యాయి. 2020లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బాబ్డే మరిన్ని వ్యవహారిక భాషలను ఈ చట్టంలో పొందుపర్చాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. 

ప్రాంతీయ భాషలు 

ఆర్టికల్​ 345: రాష్ట్రాల శాసనసభలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను కానీ లేదా హిందీని కాని తమ అధికార భాషగా ప్రకటిస్తూ చట్టం చేయవచ్చు. అంటే రాష్ట్రానికి ఎనిమిదో షెడ్యూల్​లో పేర్కొన్న భాషలనే అధికారిక భాషలుగా ఉపయోగించాలనే పరిమితి లేదు. 
ఆర్టికల్​ 346: కేంద్ర ప్రభుత్వం అధికార భాష(ఇంగ్లిష్) కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, వేర్వేరు రాష్ట్రాల మధ్య సమాచార ప్రసార మాధ్యమంగా కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో దేశంలోని 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు హిందీని అధికార భాషా మాధ్యమంగా ఉపయోగించాలని నిర్ణయిస్తే హిందీని వాడవచ్చు. 
ఆర్టికల్​ 347: భాషాపరమైన అంశాల పరిరక్షణ కోసం ఒక రాష్ట్రంలో అధికంగా ఉండే ప్రజలు మాట్లాడే భాషను అధికార భాషగా రాష్ట్రపతి ఆమోదిస్తే, రాష్ట్రమంతటా అధికారికంగా ఉపయోగించబడును 
రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్​లో 22 భాషలను గుర్తించారు. మౌలిక రాజ్యాంగంలో 14 భాషల ప్రస్తావన ఉంది. కానీ కాలానుగుణంగా వివిధ రాజ్యాంగ సవరణల వల్ల 2022, ఫిబ్రవరి వరకు 22 భాషలకు ఈ సంఖ్య పెరిగింది. అవి.. అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలీ, మలయాళమ్​, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలీ, సింధీ, తమిళ్​, తెలుగు, ఉర్దూ.