పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ ఉద్రిక్తతకు దారితీస్తున్నది. సాగు భూములను కాపాడుకునేందుకు రైతులు గత 15 రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం కీలక మలుపు తిరిగాయి. మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపకపోతే పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కళ్లాపూర్ రైతులు హెచ్చరించారు. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, పంట భూములను లాక్కోవద్దని డిమాండ్ చేశారు.
అటవీ మార్గంలో వచ్చిన మాజీ ఎమ్మెల్యే
భూసేకరణను వ్యతిరేకంగా రైతులకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి వస్తుండగా పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలీసుల కళ్లు గప్పి, అటవీ మార్గం గుండా కాలినడకన రైతుల దీక్షా శిబిరానికి చేరుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నా పట్టించుకోకుండా, ఇక్కడ పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా రైతులకు అండగా ఉండి భూములను కాపాడుతామని భరోసా ఇచ్చారు.
పరిగిలో హైటెన్షన్.. అరెస్టుల పర్వం
పరిగి మున్సిపల్ కేంద్రంలో సోమవారం రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రుల పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో గందరగోళం మొదలైంది. హరీశ్ రావు పర్యటనకు అనుమతి కోరుతూ సోమవారం రాత్రి కళ్లాపూర్ సర్పంచ్ పులేందర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్, తన భార్యాపిల్లలతో కలిసి స్టేషన్ లోనే నిరసన చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, మంగళవారం ఉదయం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఆయనను అక్కడి నుంచి తరలించి మన్నెగూడ పీఎస్లో ఉంచారు. రోజంతా పరిగిలో టెన్షన్ కొనసాగగా, చివరకు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో బంట్వారం పోలీసులు మహేశ్ రెడ్డిని విడుదల చేశారు.
