- భూకబ్జా కేసులో నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు
- కేసులో తన పేరు తొలగించాలని హైకోర్టుకు కీలక నిందితుడు మర్రి వెంకటస్వామి
కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌లోని పద్మనగర్ ఏరియాలో ఇటీవల భూకబ్జా కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మిగతా వారిని ఉద్దేశపూర్వకంగానే తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట రెవెన్యూ పరిధిలోని 212 సర్వే నంబర్ లో తనకున్న స్థలాన్ని కొందరు కబ్జా చేశారని షేక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు జనవరి 28న కేసు నమోదు చేశారు.
నిందితుల్లో ఏ1గా కిన్నెర మల్లవ్వ, ఏ2గా మర్రి వెంకటస్వామి, ఏ3గా బామండ్ల రవీందర్, ఆ తర్వాత వరుసగా మాడిశెట్టి భాగ్యలక్ష్మి, లోకిని పోచయ్య, మారిటిగుండ తిరుపతి, అనుమ బాలయ్య, లోకిని ఆదిత్య, లోకిని రాజవ్వతోపాటు ప్రైవేట్ బ్యాంకు అధికారులను నిందితులుగా చేర్చారు.
ఈ కేసులో నిందితురాలు మాడిశెట్టి భాగ్యలక్ష్మి ఇప్పటికే చనిపోయింది. కిన్నెర మల్లవ్వ, బామండ్ల రవీందర్, లోకిని పోచయ్య, అనుమ బాలయ్య, లోకిని ఆదిత్య, లోకిని రాజవ్వను అరెస్టు చేసిన పోలీసులు.. ఏ2గా ఉన్న కీలక నిందితుడు మర్రి వెంకటస్వామితోపాటు మారిటిగుండ తిరుపతి, ప్రైవేట్ బ్యాంకు ఎంప్లాయీస్ ను అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలోని ఓ ఆఫీసర్ కు సన్నిహితుడనే కారణంతోనే మర్రి వెంకటస్వామిని వదిలేశారనే ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా ఆయన తన పేరు కేసు నుంచి తీసేయాలని హైకోర్టును ఆశ్రయించడం వెనక పోలీసుల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది.
214 సర్వే నంబర్ లో 25 చోట్ల మర్రి వెంకటస్వామి పేరు..
కొత్తపల్లి మండలం చింతకుంటలోని 214 సర్వే నంబర్ ఈసీ చెక్ చేస్తే 25 చోట్ల మర్రి వెంకటస్వామి పేరు కనిపిస్తోంది. ఇందులో చాలా ప్లాట్లు తొలుత కిన్నెర మల్లవ్వ పేరిట రిజిస్ట్రేషన్ కావడం, ఆ తర్వాత కొద్ది రోజులకే మర్రి వెంకటస్వామి పేరిట సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఉంది. ఆయన పేరు నుంచి ఇదే ముఠాలోని సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ కావడం కనిపించింది. పోలీసులు లోతుగా విచారిస్తే 212, 214 సర్వే నంబర్లతో పాటు నగరంలో ఇలా ఎన్ని ఖాళీ ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందనే విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.
