- సర్కారు నిబంధనలు పాటించకపోతే సీట్లలో కోత విధించే చాన్స్
- ఈ సారి మైనర్, హానర్స్ ల్యాబ్‌లపై స్పెషల్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీల్లో వసతులు, ఫ్యాకల్టీ లెక్కలు తేల్చేందుకు జేఎన్టీయూహెచ్ సిద్ధమైంది. 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్ కోసం ఫైండ్ ఫ్యాక్ట్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) తనిఖీలను ఈ నెల 10 నుంచి ప్రారంభించనుంది. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర ప్రొఫెషనల్ కాలేజీల్లో ఏఐసీటీఈ, సర్కారు నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో ఈ కమిటీలు పరిశీలించనున్నాయి.
రెండు వారాల పాటు తనిఖీలు..
వర్సిటీ పరిధిలో మొత్తం 216 ప్రొఫెషనల్ కాలేజీలు ఉండగా, వచ్చే ఏడాది అఫిలియేషన్ కోసం ఇప్పటివరకు 153 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. పెనాల్టీతో అప్లై చేసుకునేందుకు ఈ నెల12 వరకు గడువు ఇచ్చారు. ఎఫ్ఎఫ్సీ తనిఖీ ప్రక్రియ మొత్తాన్ని రెండు వారాల్లోనే పూర్తి చేయాలని వర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల క్లాసులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రొఫెసర్లతో చర్చించి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అయితే, తనిఖీ తేదీకి 48 గంటల ముందు కాలేజీలకు, 24 గంటల ముందు తనిఖీ సభ్యులకు సమాచారం అందిస్తారు.
కాగా, ఈ ఏడాది చాలా కాలేజీల్లో సిబ్బందికి సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. దీనికోసం ఆందోళనలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎఫ్ఎఫ్ సీలు ఎలాంటి నివేదికలు ఇస్తాయనేది అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. మరోపక్క సర్కారుపై ప్రైవేటు మేనేజ్మెంట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో ఈ సారి తనిఖీలు సీరియస్‌గానే జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో మేనేజ్మెంట్లలో ఆందోళన మొదలైంది.
వంద మందితో టీమ్స్..
తనిఖీల కోసం వర్సిటీ అధికారులు సుమారు వంద మంది సభ్యులతో కూడిన ఎఫ్ఎఫ్ సీ టీమ్స్ ను సిద్ధం చేశారు. పారదర్శకత కోసం తనిఖీ బృందాల్లోని సభ్యులను నిరంతరం మారుస్తారు. ఒక్కో సభ్యుడు మూడు లేదా నాలుగు కాలేజీలకు మించి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో కమిటీ రోజుకు ఒకటి లేదా రెండు కాలేజీలను విజిట్ చేయనుంది. కాలేజీల్లో బ్రాంచులు, దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ ఉందా? లేదా? వారికి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేస్తున్నారా? ఫ్యాకల్టీకి సక్రమంగా జీతభత్యాలు ఇస్తున్నారా? బ్యాంక్ స్టేట్ మెంట్లను చెక్ చేయనున్నారు.
అయితే, కొత్త సిలబస్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా మైనర్, హానర్స్ కోర్సుల ల్యాబ్‌లను ఈసారి ప్రత్యేకంగా తనిఖీ చేయనున్నారు. వీటితో పాటు బయోమెట్రిక్ అటెండెన్స్, బిల్డింగ్ ఫిట్‌నెస్, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీలు, ల్యాండ్ డాక్యుమెంట్లను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి వర్సిటీకి రిపోర్టు ఇస్తారు.
లోపాలుంటే సీట్లలో కోత తప్పదు..
తనిఖీల్లో ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే కాలేజీలకు వర్సిటీ అధికారులు రిపోర్ట్ పంపిస్తారు. వాటిని సరిదిద్దుకోవడానికి ఒక చాన్స్ ఇస్తారు. అప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోకపోతే సదరు కాలేజీల్లో సీట్ల సంఖ్యలో కోత విధిస్తారు. మౌలిక వసతుల సమస్యలు ఎక్కువగా ఉంటే కోర్సుల అనుమతులనే నిరాకరిస్తామని వర్సిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
