రాజేంద్రనగర్, వెలుగు: డబ్బులు ఇస్తే త్వరగా చార్జ్‌షీట్ ఫైల్ చేస్తామని, లేదంటే కుటుంసభ్యులను కూడా ఇరికిస్తామని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఓ సీఐతో పాటు ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీస్‌స్టేషన్‌లో సంపతి కనకయ్య సీఐగా, సిద్ధేశ్వర్ఎస్సైగా పని చేస్తున్నారు. కొంత కాలం కింద ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల కేసులో నిందితుడిగా ఉన్న కేరళకు చెందిన వ్యక్తి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడు ప్రతి ఆదివారం స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలి.
ఈ క్రమంలో త్వరగా చార్జ్‌షీట్ ఫైల్ చేస్తే అటెండెన్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుందని నిందితుడు భావించాడు. దీని గురించి రిక్వెస్ట్చేయగా, డబ్బులు ఇస్తేనే తొందరగా చార్జ్‌షీట్ ఫైల్అవుతుందని, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇన్వాల్వ్ చేస్తామని బెదిరించారు. అంతా సెట్చేయాలంటే రూ.15 లక్షలు డిమాండ్ చేసి, రూ.5 లక్షలకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం రూ.2 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
పరుగో పరుగు..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్స్టేషన్లో ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోగా, గమనించిన సీఐ సంపతి కనకయ్య పరుగందుకున్నారు. అతడి వెంట పడిన ఏసీబీ అధికారులు సినీఫక్కీలో ఛేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. సీఐ సంపతి కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.వారిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామని రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.
రూ.లక్ష లంచం తీసుకుంటూ..
గండిపేట: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రోనమీ అసోసియేట్ డీన్, ఏవో డాక్టర్ ఎం.గోవర్థన్ రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సంస్థకు విత్తన లైసెన్స్ జారీ చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని, అసోసియేట్ డీన్ గోవర్ధన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
