- గార్డెనింగ్, లైటింగ్, కోనేరు సుందరీకరణకు చర్యలు
- ఇప్పటికే రూ.17 కోట్లతో కల్యాణ మండపం పునర్నిర్మాణం
- ఆలయ విస్తరణకు రెండెకరాల భూసేకరణకు శ్రీకారం
- బాధితుల పరిహారం కోసం రూ.20 కోట్ల నిధులు
వరంగల్, వెలుగు: ఓరుగల్లులోని హనుమకొండ వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరుడి ఆలయంలో కాకతీయ కళావైభవం మరింత మెరువనుంది. ఆలయ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్ల 44 లక్షల నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితమే కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించే కల్యాణ మండపాన్ని పునర్నిర్మించగా, అప్పటి నుంచి భక్తుల రద్దీ పెరిగింది. అయితే ప్రధాన ఆలయం, కల్యాణ మండపం తప్పితే మిగతా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో ఇప్పుడు కేంద్ర టూరిజం శాఖ నిధులతో అక్కడ సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఆలయం ముందు ఇరువైపులా ఉన్న కొన్ని ఇండ్లను తొలగించి సుమారు రెండు ఎకరాల స్థలాన్ని విస్తరణకు వినియోగించాలనే యోచన కూడా ఉంది.
శిల్పకళకు నెలవు..
హనుమకొండలోని వేయి స్తంభాల గుడికి సుమారు 863 ఏండ్ల చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో మొదటి రుద్రుడు 1163లో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళకు నిదర్శనం. సుమారు 1400 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే ప్రాంగణంలో పూజలందుకుంటారు. అందుకే దీనిని త్రికూటాలయంగా కూడా పిలుస్తారు. ఆలయంలోని ప్రతి రాయి సంగీతాన్ని పలికించేలా చెక్కబడింది.
సప్తస్వరాలను శిలల్లో ప్రతిధ్వనింపజేసిన ఘనత అప్పటి శిల్పులకు దక్కింది. ఆధునిక యంత్రాలు లేకుండానే ఈ నిర్మాణం శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలిచింది. తుగ్లక్ సేనల దాడులు జరిగినప్పటికీ నిర్మాణం దెబ్బతినలేదు. డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి వంటి మిశ్రమాలతో ఈ ఆలయ నిర్మాణం సాగింది. భారీ వర్షాల కారణంగా కొన్నేళ్ల క్రితం కల్యాణ మండపంలోని కొన్ని స్తంభాలు కుంగినా శిల్ప సంపద మాత్రం నిలకడగా ఉంది.
కల్యాణ మండపం పునర్నిర్మాణం..
వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణ మండపం పర్యాటకులను ఆకర్షించే ముఖ్య కట్టడం. వరదలు, వర్షాల కారణంగా కొంత భాగం దెబ్బతినడంతో 2006లో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రూ.7.5 కోట్లతో పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు ఈ పనులు చేపట్టారు. అయితే ఆ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఆలస్యమైంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇది పూర్తికాలేదు.
అనంతరం కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 2022లో ఆలయాన్ని సందర్శించి మరో రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం 2024 మార్చిలో కల్యాణ మండపాన్ని ఆయన చేతుల మీదుగా పునఃప్రారంభించారు.
నంది మండపం, బ్యూటిఫికేషన్ పనులు..
కల్యాణ మండపం ప్రారంభమైన తర్వాత భక్తులు, పర్యాటకుల రాక పెరిగింది. కానీ ఆలయం చుట్టూ ప్రాంగణం ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు చేయాల్సి వచ్చింది. స్థానిక వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంతో రూ.14 కోట్ల 44 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కల్యాణ మండపం దక్షిణ భాగంలో అభివృద్ధి పనులకు రూ.4.50 కోట్లు, రేకుల కింద ఉన్న నందీశ్వరుడి మండపానికి రూ.1.20 కోట్లు కేటాయించారు. అదనంగా గార్డెన్, లైటింగ్ వంటి సుందరీకరణ పనులకు రూ.4.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. పర్యాటకుల కోసం తాగునీరు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఆలయ కోనేరును కూడా శుభ్రపరిచి అభివృద్ధి చేయనున్నారు.
ఇండ్ల తొలగింపునకు చర్యలు..
హనుమకొండ చౌరస్తాలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నప్పటికీ వేయి స్తంభాలగుడి స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి జరగలేదు. ఆలయం చుట్టూ అనేక ఇండ్లు ఉండటంతో విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఇండ్లను తొలగించి ఆలయ పరిసరాలను విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం కోర్టులోకి వెళ్లడంతో కొంతకాలం ఆలస్యం జరిగింది. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇండ్ల యజమానులతో చర్చలు జరుపుతున్నారు. వారికి పరిహారం కోసం రూ.20 కోట్లు కేటాయించారు. బాధితులకు న్యాయం చేస్తూ పాత నిర్మాణాలను తొలగిస్తే సుమారు రెండు ఎకరాల స్థలంలో ఆలయాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. అలా జరిగితే మెయిన్ రోడ్డు నుంచే వేయిస్తంభాల గుడి వైభవం పర్యాటకులను ఆకర్షించేలా మారనుంది.
