తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలి..జిల్లా రైతు సంఘం డిమాండ్

తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలి..జిల్లా రైతు సంఘం డిమాండ్

తాండూరు, వెలుగు: తాండూరు కందులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని జిల్లా రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో వారు సమావేశమయ్యారు. మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం మార్కెట్​లో క్వింటాల్ కంది ధర కేవలం రూ. 6,500 నుంచి రూ. 8,000 మధ్యనే పలుకుతోందని, అదే సమయంలో బయట పప్పు ధర మాత్రం రూ. 14,000 నుంచి రూ. 15,000 వరకు ఉండటం దారుణమన్నారు. పండించిన రైతు గిట్టుబాటు ధర దక్కక నష్టపోతుంటే, మధ్యవర్తులు మాత్రం లక్షల రూపాయల లాభాలు గడిస్తున్నారని విమర్శించారు. రైతులను ఈ దోపిడీ నుంచి కాపాడేందుకు తక్షణమే తాండూరులో కంది బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే క్వింటాల్​కు కనీసం రూ. 10 వేల మద్దతు ధర లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.