ఈ సారి ఎండా వాన!..సమ్మర్ లో మిక్స్ డ్ వెదర్

ఈ సారి ఎండా వాన!..సమ్మర్ లో మిక్స్ డ్ వెదర్
  • వేసవిలో మిక్స్​డ్ వెదర్ ఉంటుందంటున్న అధికారులు, నిపుణులు
  •     ఫిబ్రవరి రెండో వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు వర్షాలతో పాటు ఎండలు 
  •     మే నుంచే వేడి తీవ్రం.. 2023కు మించి టెంపరేచర్లు
  •     ఎల్​నినో ప్రభావం చూపే అవకాశం ​
  •     ఈసారి జూన్ రెండో వారం వరకూ సమ్మర్ ఎఫెక్ట్  

హైదరాబాద్, వెలుగు: ఈసారి ఎండాకాలం మండిపోనుందని, ఎండలతో పాటు వర్షాలూ అప్పుడప్పుడు పలకరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఫీసర్లు, నిపుణులు చెప్తున్నారు. ఈ సమ్మర్ లో జనం మిక్స్​డ్ వెదర్​తో ఇబ్బందిపడక తప్పని పరిస్థితులు రానున్నాయని అంటున్నారు. ఓవైపు వానలు.. మరోవైపు ఎండలతో ఈ వేసవి కాలం భిన్నంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్లే వేసవి ఇలా ఎండావానల కలబోతగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పడిప్పుడే చలి కాలం నిష్క్రమిస్తుండగా.. ఫిబ్రవరి రెండో వారం నాటికి ఎండాకాలం మెల్లగా మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఏప్రిల్​ చివరి వరకు ఎండతో పాటు మోస్తరు వానలు కూడా పడే అవకాశాలున్నాయని అంటున్నారు. కొన్నిసార్లు క్లౌడ్​బరస్ట్​లకూ చాన్సెస్ ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే, అసలు ఎండాకాలం మే నెలలోనే మొదలవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. 2023 ఏడాదికి మించి ఈ ఎండాకాలంలో ఎండలు కొట్టే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. మేతో పాటు జూన్ మొదటి వారంలోనూ ఎండలు మండిపోయే చాన్స్ ఉందని అంటున్నారు.  

ఎల్​నినో ప్రభావం..

ఈ ఏడాది ఎండాకాలం సెకండ్ ఫేజ్ నాటికి ఎల్​నినో బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులతో పాటు అంతర్జాతీయ వెదర్ సంస్థలు తేల్చి చెబుతున్నాయి. 2023లో బలమైన ఎల్​నినో ఏర్పడడంతో ఆ ఏడాది ఎండలు చాలా తీవ్రంగా నమోదయ్యాయి. 2025 ప్రారంభానికి లానినా బలపడడంతో మంచి వర్షాలు పడ్డాయి. ఇటు ఎండల ప్రభావం కూడా పెద్దగా లేదు. అయితే, డిసెంబర్ నాటికి లానినా ఫేజ్ ముగిసిపోయే దశకు చేరుకుందని, ప్రస్తుతం ఎల్​నినోగా మార్పు చెందేందుకు వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో గాలుల దిశ (విండ్ ప్యాటర్న్​) క్రమంగా మారుతున్నదని, దాని వల్ల వేడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంతో పాటు తెలంగాణలోనూ ఈ ఏడాది మేలో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు. అదేసమయంలో రుతుపవనాల రాక కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని, వర్షపాతం కూడా తక్కువగా రికార్డయ్యే చాన్స్ ఉందని భావిస్తున్నారు. అయితే, ఎల్​నినో ఎఫెక్ట్ తీవ్రత ఎంతవరకు ఉంటుందన్న విషయం తెలియాలంటే మే వరకు ఆగాల్సిందేనని చెబుతున్నారు. 

తగ్గుతున్న చలి

రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో తప్ప.. మిగతా జిల్లాల్లో చలి ప్రభావం అంతగా లేదు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. శనివారం రాత్రి అత్యల్పంగా కుమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి.టీ లో 8.7, సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 8.8, రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 9.8 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో10 నుంచి 14 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. హైదరాబాద్ సిటీ పరిధిలోనూ10 డిగ్రీలకుపైగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, సోమవారం ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలతో పాటు వెస్ట్, సెంటర్​లోని ఐదు జిల్లాల్లో చలి ప్రభావం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.