
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ద్వారా అందిస్తున్న సారథి సేవలను అన్ని జోనల్ కేంద్రాల్లో విస్తరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న ఈ సేవలను శనివారం నుంచి ఖైరతాబాద్ (సెంట్రల్ జోన్)లో ప్రారంభించారు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులు, జారీ, రెన్యూవల్, డుప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి జారీ, లైసెన్స్ హిస్టరీ షీట్, ఎండార్స్‌మెంట్, ఎక్స్‌పైర్ అయిన లెర్నింగ్ లైసెన్స్ స్థానంలో కొత్త లైసెన్స్ జారీ వంటి సేవలను సారథి ద్వారా అందిస్తున్నారు.
సోమవారం నుంచి పర్మినెంట్ లైసెన్స్, డుప్లికేట్ లైసెన్స్, అడ్రస్ మార్పు సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని జెటిసి రమేశ్‌కుమార్ తెలిపారు. వచ్చే వారం లేదా 10 రోజుల్లో నగరంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో సారథి సేవలు అమలులోకి వస్తాయన్నారు. త్వరలో వాహన రిజిస్ట్రేషన్లు, బదిలీలు, ఆర్టీఏ పర్మిట్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొన్నారు.