కొడిమ్యాల,వెలుగు: బాల్య వివాహం చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులను అధికారులు అడ్డుకొని కౌన్సెలింగ్ ఇచ్చిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో గురువారం జరిగింది. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన బాలికను పూడూరుకు చెందిన యువకుడికి ఇచ్చి పెండ్లి చేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయించారు. గురువారం పూడూరు గ్రామంలో గురువారం పెళ్లిచూపుల ఏర్పాటు చేయగా.. స్థానికులు ఫోన్ ద్వారా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
డీటీ ఖాజా మహమ్మద్, ఆర్ఐ రాజారామ్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శ్రావణ్, పూడూరు సర్పంచ్ కడారి మల్లేశం, ఉప సర్పంచ్ సంతోష్ యువకుడి ఇంటికి వెళ్లి పెళ్లిచూపులను అడ్డుకున్నారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాల్య వివాహాలు చేయడం నేరమని తెలిపారు. బాలికకు 18 ఏండ్లు వచ్చేవరకు పెళ్లి చేయమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాసివ్వడంతో అధికారులు వెళ్లిపోయారు.
