
హైదరాబాద్ సిటీలో వర్ష బీభత్సం. 2025, సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజాము నుంచి జోరున వర్షం. ముసురు పట్టేస్తుంది. సూర్యుడి కనిపించలేదు. నిద్ర లేస్తూనే అందరూ వర్షాన్ని చూశారు.. ఉదయం 8 గంటలు అయినా చీకటిలా మారిపోయింది వాతావరణం. చిరు జల్లులు పడుతూనే.. అప్పుడప్పుడు భారీ వర్షం. తగ్గినట్లే కనిపిస్తూ.. అంతలోనే బీభత్సమైన వాన. జోరు వానతో సిటీ వాసులు అల్లాడిపోయారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై నీళ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు.
సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజంతా ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం పడుతున్న వర్షం తీరును.. ఆన్ అండ్ ఆఫ్ (ON & OFF వర్షం)గా స్పష్టం చేసింది. అంటే కాసేపు వర్షం పడుతుంది.. మరికొంత సమయం వర్షం ఆగిపోతుంది. పడే వర్షం భారీగా ఉంటుంది.. అంతలోనే సడెన్ గా ఆగిపోతుంది. ఉదయం నుంచే ఇదే తరహా వర్షం పడుతుంది హైదరాబాద్ సిటీలో.
ALSO READ : హైదరాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తున్నది..
రాబోయే 24 గంటలు.. అంటే సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ఉదయం వరకు హైదరాబాద్ సిటీలో ఇదే తరహా వాతావరణం.. వర్షం ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే అత్యవసరం అయితే బయటకు రావాలని హైదరాబాద్ సిటీ జనానికి సూచనలు జారీ చేసింది వెదర్ డిపార్ట్ మెంట్. వీలైతే వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఉపయోగించుకోవాలని.. భారీ వర్షంతో రోడ్లపై నీళ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ శివార్లలోనూ ఇదే తరహా వానలు పడతాయని.. జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది.