
- మెట్రో విస్తరణకు కేంద్రం అడ్డుపడటం లేదు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నదని, ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని అంశమని, వారే తేల్చుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం అడ్డుపడటం లేదు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సరిగా లేదు.
ఒక ప్రజాప్రతినిధిగా.. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ముందువరుసలో ఉంట” అని ఆయన చెప్పారు. తన మంత్రిత్వ శాఖలో తెలంగాణ ప్రాజెక్టుల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేసుకుని, అన్నిరకాల అభివృద్ధి పనులను మానిటర్ చేస్తున్నానని తెలిపారు. ‘‘నేను కానీ, కేంద్రం కానీ మెట్రో విస్తరణ జరగకుండా అడ్డుకోడం లేదు.
రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విషయంలో అందరికంటే ముందే మేం చురుకుగా వ్యవహరించాం. ఆర్థిక సంస్థలు రుణాలిస్తున్నప్పుడు.. చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతుంటాయి” అని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కిషన్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులపై ఆయనతో చర్చించారు. అనంతరం తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో మరిన్ని నేషనల్ హైవేలు
రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభం కానుందని గడ్కరీ చెప్పారని కిషన్‌రెడ్డి అన్నారు. 26 ప్రాజెక్టులు డీపీఆర్ స్టేజ్‌లో ఉన్నాయని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తవుతాయనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుసంధానత పెరిగిందని.. విజయవాడ, బెంగూళూరు, నాగ్‌పూర్, ముంబై వైపు కనెక్టివిటీ మెరుగైందని తెలిపారు.
తెలంగాణ అభివృద్దికి బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఆయన అన్నారు. ఈ ఏడాది తెలంగాణలో కొత్తగా రూ.30,425 కోట్ల విలువైన 1,174 కి.మీ. నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో భక్తులు, పర్యాటకుల కోసం హైదరాబాద్ -– -శ్రీశైలం రోడ్డు మార్గంలో 4లేన్ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే చేపట్టాలని కేంద్రం భావిస్తున్నదని చెప్పారు. అలాగే హైదరాబాద్, కల్వకుర్తి మధ్యలో.. 4లేన్ కావాలని అడిగామని, దానిపై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పారని ఆయన వివరించారు.
వాళ్లు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బీజేపీ ఫోబియా పట్టుకుందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘సీఎంతో పాటు ఆ పార్టీల నేతలు ఆధారాల్లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు కలిసి పనిచేశారు. పదవులు పంచుకున్నారు. అలాంటి వారు బీజేపీకి నీతులు, కథలు చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మా పార్టీ ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తుంది.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని తెలిపారు. ‘‘కాళేళ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో ప్రభుత్వం నుంచి సీబీఐకి ప్రతిపాదన వస్తుంది. దీన్ని సీబీఐ పరిశీలిస్తుంది.. ఇదీ ప్రాసెస్. త్వరలో సీబీఐ నిర్ణయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి పరిమితులు, పరిధులు ఉంటాయి. బీసీలకు రిజర్వేషన్లు పెరగాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో మేం ఓటు వేశాం. రిజర్వేషన్లపై కేంద్రం, గవర్నర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం’’ అని చెప్పారు.
కేటీఆర్ కామెంట్స్ దేశద్రోహ చర్యలు
జెన్ జెడ్ విషయంలో కేటీఆర్ చేసిన కామెంట్లు దేశద్రోహ చర్యల్లాంటివని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘నేపాల్‌లో పీఎం, మంత్రుల ఇండ్లు, కోర్టులపై దాడులు జరిగినట్లుగా.. ఇక్కడ కూడా జరగాలని కేటీఆర్ కోరుకుంటున్నరా?” అని ఫైర్ అయ్యారు.