రష్యాలోని ఉఫా నగరంలో బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లో శనివారం కత్తి దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు.
సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే... సుమారు 15 ఏళ్ల ఉన్న ఓ బాలుడు కత్తితో హాస్టల్‌లోని స్పోర్ట్స్ హాల్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చి, అక్కడ ఉన్న విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినా.. వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. చివరకు నిందితుడు తనను తాను గాయపరుచుకోగా.. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు రష్యాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. కజాన్‌లోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడికి చేరుకొని గాయపడిన విద్యార్థులకు అవసరమైన వైద్యం, సహాయం అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థులు, పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. దాడి చేసిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
