- నాలుగు కీలక ఒప్పందాలకు అధికారుల అంగీకారం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు మధ్య దక్షిణ భారత స్థాయిలో బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఈ ఒప్పందాలపై సింగరేణి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కె. సూర్యనారాయణ, ఎన్టీపీసీ సౌత్ అండ్ వెస్ట్రన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేభశిష్ ఛటోపాధ్యాయ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏజీఎంలు, డీజీఎంలు, అడిషనల్ మేనేజర్లు, ఎన్టీపీసీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ ప్రదీప్ కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ఒప్పందాలు ఇవే..
ఎన్టీపీసీ కర్నాటక రాష్ట్రంలో నిర్వహిస్తున్న కుడిగీ 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సింగరేణి సంస్థ ఏడాదికి 67.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పందం జరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద నిర్వహిస్తున్న 660 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి గతంలో ఉన్న బొగ్గు సరఫరా ఒప్పందాన్ని పెంచుతూ ఏడాదికి 28.2 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మరో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు జరిపినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. అలాగే, ముందస్తు చెల్లింపులకు మరో ఒప్పందం జరిగింది.
ఎన్టీపీసీ రామగుండంలోని తమ ప్లాంట్ కు సరఫరా చేసే బొగ్గుకు అడ్వాన్స్ చెల్లింపులకు అంగీకరిస్తూ మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్టీపీసీ ఈ ప్లాంట్ కు ప్రతినెలా దాదాపు 85 లక్షల నుంచి 90 లక్షల టన్నుల బొగ్గు స్వీకరిస్తుంది. అలాగే, ఎన్టీపీసీ.. సింగరేణి నుంచి కొనుగోలు చేస్తున్న మొత్తం 207.7 లక్షల టన్నుల బొగ్గును, ఎన్టీపీసీ నిర్వహిస్తున్న మూడు ప్లాంట్లలో అక్కడి అవసరాన్ని బట్టి ఏ ప్లాంటుకైనా సరే సరఫరాను మళ్లించడానికి అవకాశం కల్పిస్తూ ఫ్లెక్సీబిలిటీ అంగీకార ఒప్పందం జరిగింది.
