లోటస్ పాండ్ దగ్గర ఉద్రిక్తత.. షర్మిల హౌజ్ అరెస్ట్

లోటస్ పాండ్ దగ్గర ఉద్రిక్తత.. షర్మిల హౌజ్ అరెస్ట్

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికని బయలుదేరిన వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని వేడుకున్నారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరమర్శిస్తానని షర్మిల స్పష్టం చేశారు. వెళ్ళనివ్వద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డులో వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. రూ.200కోట్లు పెట్టి ఉస్మానియా హెల్త్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ గాలి మాటలు చెప్పారని విమర్శించారు. తనను హౌజ్ అరెస్టు చేయడంపైనా ఆమె నిప్పులు చెరిగారు. మీకు ఏం అధికారం ఉందని హౌజ్ అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ నియంత అని మరో సారి నిరూపణ అయ్యిందని, వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నాడని సెటైరికల్ కామెంట్స్ చేశారు. అందుకే తనను ఆపుతున్నారని, ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్నీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనతా రైడ్ కి పిలుపు నిచ్చామన్న షర్మిల.. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని అనుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఇయ్యాళ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాలని అనుకున్నామని చెప్పారు. తాను ఒక్క దాన్ని మాత్రమే వస్తానని, దమ్ముంటే అనుమతి ఇవ్వండి అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వడం లేదన్న ఆమె.. ప్రజల పక్షాన నిలబడితే హౌజ్ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడటం తప్పా..? అని షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఅర్ ఒక డిక్టేటర్ అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

తన ఇంటి బయట భారీగా పోలీసులు ఎందుకు మోహరించారని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తనను ఏం చేస్తారో చెప్పండి సీఎం కేసీఆర్ గారు.. అంటూ రాసుకొచ్చారు. ఇది మీ భయాన్ని స్పష్టంగా తెలియజేస్తుందన్న ఆమె.. "సీఎం కేసీఆర్.. మీరు నన్ను ఆపలేరు, నా గొంతుకను మూయలేరు, నేను ప్రజల గొంతును" అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. 

https://twitter.com/realyssharmila/status/1640605415779217408