లక్షన్నర పోస్టులు ఖాళీ -కోదండరామ్

లక్షన్నర పోస్టులు ఖాళీ -కోదండరామ్

32 శాఖల్లోనూ ఇదే పరిస్థితి

పోలీస్​, ఎడ్యుకేషన్​,  హెల్త్​, రెవెన్యూలోనే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొత్తగా శాంక్షన్​ అయిన పోస్టులతోపాటు కొందరు రిటైర్​​కావడంతో ఏర్పడినవి ఉన్నాయి. మొత్తం 32 శాఖల్లో హెచ్​వోడీ ఆఫీసులు, జిల్లాల్లో కలిపి 4,57,798 పోస్టులకుగాను ప్రస్తుతం 3,91,132 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 1,48,666 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థాయిలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయకపోవడంపై విద్యార్థి, యువజన సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 37,218 ఖాళీలతో పోలీస్​ శాఖ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్కూల్​ ఎడ్యుకేషన్​ లో 24,702 పోస్టులు, వైద్య, ఆరోగ్య శాఖలో 23,512 , ఉన్నత విద్యాశాఖలో 12,857 , రెవెన్యూ శాఖలో 8,118 పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్​​ కోదండంరాం శనివారం వెల్లడించారు. వెంటనే ఆ పోస్టులను భర్తీ చేయాలని, రిక్రూట్​మెంట్​ క్యాలెండర్​ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. ఏపీలో ప్రైవేట్​​పరిశ్రమలు, సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేసినట్టుగానే తెలంగాణలోనూ చట్టం తీసుకురావాలన్నారు. నిరుద్యోగ సమస్యపై సోమవారం నుంచి విద్యార్థి జనసమితి, యువజన సమితి నిరుద్యోగ పాదయాత్ర చేస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రం వచ్చి ఏడేళ్లవుతున్నా ఉద్యోగాల కోసం నిరుద్యోగ యాత్ర చేయాల్సి రావడం దారుణమన్నారు. నాగులులాంటి వాళ్లు అసెంబ్లీ ఎదుట  ఆత్మహత్యాయత్నం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.