హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీలో వన్ డే వన్ సర్కిల్ విజిట్ ప్రోగ్రాం నిర్వహించిన కమిషనర్ సృజన ఇప్పుడు వన్ డే వన్ వార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మంగళవారం గచ్చిబౌలి వార్డులో పర్యటించారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
మణికొండ చెరువు కాలుష్యానికి గురైందని చెప్పగా.. స్పందించిన కమిషనర్, చెరువు చుట్టూ అభివృద్ధి పనులతో పాటు ఎస్టీపీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖాళీ స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దాలని, ఎస్ఎన్ డీపీ ఫేజ్-–2 కింద పెండింగ్‌లో ఉన్న పనులను హెచ్‌ఎండీఏతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్ల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ నిర్వహణలో భాగంగా సాలిడ్ వేస్ట్ వేనేజ్ మెంట్ రూల్స్ ప్రకారం నాలుగు రకాలుగా చెత్తను వేరు చేయాలని అవగాహన కల్పించారు.
