
- ముగ్గురి పరిస్థితి విషమం
- హైదరాబాద్ వనస్థలిపురంలో ఘటన
ఎల్బీ నగర్, వెలుగు: ఫ్రిజ్ లో ఉంచిన బోటీ, చికెన్ కర్రీని వేడిచేసి తినడంతో ఒకరు చనిపోగా.. ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ వనస్థలిపురం చింతలకుంటలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటకు చెందిన శ్రీనివాస్ యాదవ్ (46), ఆయన భార్య రజిత(38), ఇద్దరు కూతుళ్లు జస్మిత (15), లహరి (17) వనస్థలిపురం చింతలకుంటలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
శ్రీనివాస్ యాదవ్ ఫలక్ నుమా ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 20నబోనాల పండుగ సందర్భంగా ఆయన ఇంటికి తల్లి గౌరమ్మ (65), బావమరిది సంతోష్ కుమార్ (39), అతని భార్య రాధిక (34), వారి కూతుర్లు పూర్విక (12), క్రితగ్న(7) వచ్చారు. పండుగ కావడంతో శ్రీనివాస్.. చికెన్, బోటీ తెచ్చాడు. ఆ రోజు తినగా మిగిలిన చికెన్, బోటీని ఫ్రిజ్లో పెట్టారు. సోమవారం మధ్యాహ్నం వేడి చేసుకుని తిన్నారు. సాయంత్రంకల్లా అందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
తొమ్మిది మందికి బీపీ పడిపోవడంతో వారిని ఐసీయూలోకి చేర్చారు. శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం చనిపోయాడు. మృతుడి తల్లి గౌరమ్మ, కూతురు జస్మిత, భార్య రజిత పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస్ యాదవ్ ఆ బోటీ, చికెన్ ఎక్కడ కొన్నాడు, అక్కడ ఏమైనా తప్పిదం జరిగిందా అనే కోణంలో ఎంక్వయిరీ చేస్తున్నారు.