నాగర్‌కర్నూల్ : కారు, బస్సు ఢీకొని ఒకరి మృతి, 14 మందికి గాయాలు

నాగర్‌కర్నూల్ : కారు, బస్సు ఢీకొని ఒకరి మృతి, 14 మందికి గాయాలు
  • నాగర్‌కర్నూల్ జిల్లా గుంతకోడూరు శివారులో ప్రమాదం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కారు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంతకోడూరు శివారులో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం కోనాపూర్ కు చెందిన శరత్ గౌడ్ (28) కారులో కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూల్ వైపు వెళ్తున్నాడు. 

ఈ క్రమంలో గుంతకోడూరు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న బైక్ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును, పక్కనే ఉన్న బైక్ ను ఢీకొట్టాడు. ప్రమాదంలో శరత్ గౌడ్ అక్కడికక్కడే చనిపోగా, బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవర్ తో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని 108లో నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.