కారు ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి

కారు ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి

మేడ్చల్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఊహించనిరీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కన్నుమూశాడు. బైకు పై నుంచి వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో ఎగిరి కిందపడ్డాడు. స్వల్పగాయాలతో బయటపడ్డాడనుకుంటున్నంతలో అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై పడిపోయిన వ్యక్తి పై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే కన్నుమూయడం స్థానికంగా కలకలం రేపింది.

మేడ్చల్  ఆర్టీయే కార్యాలయ సమీపంలో ప్రమాదం

బైక్ మీద ఉన్న వ్యక్తిని మేడ్చల్ ఆర్టీయే కార్యాలయం వద్ద ఓ కారు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. ప్రాణాలతో బయటపడ్డాడనుకున్నంతలో  వెనుక నుండి వచ్చిన ఆర్టీసీ బస్సు  రోడ్డుపై పడిపోయిన వ్యక్తిపై నుండి పోవడంతో  అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి జేబులో ఉన్న డ్రైవింగ్ లైసన్స్ ఆధారంగా సికింద్రాబాద్ బోయిన్ పల్లి సమీపంలోని న్యూ నేతాజినగర్ ప్రాంతానికి చెందిన ఆర్.నరసింహ అనే వ్యక్తిగా గుర్తించారు. ఎవరూ ఊహించని రీతిలో పట్టపగలు అందరూ చూస్తున్న సమయంలో జరిగిన ఘటన స్థానికులను ఒకింత షాక్ కు గురిచేసింది. ఒక ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డాడనుకున్నంతలో మృత్యువు మరో రూపంలో వెంటాడిందంటూ మృతుడి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.