టెండర్‌‌‌ పాడింది ఒకరు.. అద్దెకుండేది మరొకరు

టెండర్‌‌‌ పాడింది ఒకరు.. అద్దెకుండేది మరొకరు

పై ఫొటోలోని షాపింగ్‌‌ కాంప్లెక్స్‌‌ జగిత్యాల పాతబస్టాండ్‌‌ మెయిన్‌‌రోడ్‌‌లో పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందింది. ఇందులో ఉన్న 25 షాపులను లీజుకు ఇవ్వడానికి కొన్నేళ్ల కింద పోలీసులు టెండర్లు పిలిచారు. నిబంధనల ప్రకారం ఈ టెండర్లను దక్కించుకున్న వ్యక్తులు తామే షాపులు నడిపించుకోవాలి. ఇతరులకు ఇవ్వరాదు. కానీ చాలామంది టెండర్‌‌‌‌ తర్వాత డబుల్‌‌ రేట్లకు మళ్లీ కిరాయికి ఇచ్చారు. లాంగ్‌‌ టర్మ్‌‌ లీజ్‌‌ కావడంతో ఒకేసారి లక్షల రూపాయలు వసూలు చేసుకుని పక్కకు జరిగారు. నెలనెలా అద్దె కడుతుండడంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడం లేదు.

డబుల్‌‌ రేట్లకు షాపులు కిరాయికి ఇస్తున్న టెండర్ ‌‌‌‌దారులు

చేతులు మారుతున్న లక్షల సొత్తు

లాంగ్‌‌టర్మ్‌‌ లీజుతో నష్టపోతున్న పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌

జగిత్యాల, వెలుగుఏటా అద్దెలు పెరుగుతున్న క్రమంలో పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ లాంగ్‌‌టర్మ్‌‌ లీజుకివ్వడం టెండర్ ‌‌‌‌దారులకు వరంగా మారింది. చివరిసారిగా ఏడేళ్ల కిందట పదేళ్ల వరకు టెండర్‌‌‌‌ పిలిచారు. ఒక్కో షాప్‌‌కు ఒక్కో రేట్‌‌ నిర్ణయించగా వ్యాపారులు టెండర్లు పాడి దక్కించుకున్నారు. కొందరు ఏడాదిపాటు వ్యాపారం చేసి ఇతరులకు కిరాయిలకు ఇచ్చారు. మంచి అడ్డా మీద ఉండడంతో డబుల్‌ రేట్లకు అప్పగించారు. నెలకు రూ.10 వేలు కిరాయి ఉంటే రూ.20 వేలకు ఇచ్చారు. అంతేకాకుండా షాప్‌‌ ముందట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి పర్మిషన్‌ ఇచ్చి, వాళ్ల దగ్గరి నుంచి రోజుకు రూ.200 చొప్పున నెలకు రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు.

హెచ్చరించినా మారని తీరు..

ఈ విషయంపై 2017–18లో స్థానికులు పలువురు పోలీస్‌‌బాస్‌‌కు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణ జరిపించి వాస్తవమేనని నిర్ధారించారు. టెండర్‌‌‌‌ దక్కించుకున్న వారిని పిలిచి రూల్‌‌ ప్రకారం షాప్‌‌ మీరే నడుపుకోవాలని, ఇతరులకు ఇవ్వడం తప్పని చెప్పారు. షాప్‌‌లో ఇతరులు ఉంటే ఖాళీ చేయిస్తామని, టెండర్‌‌‌‌ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో కొంతకాలం మళ్లీ షాపులు నడుపుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఎప్పటిలాగే కిరాయివారికి అప్పగించేశారు.

తక్కువ గడువు, పర్యవేక్షణ ఉంటేనే బెటర్‌‌‌‌..

ఈ అక్రమ వ్యవహారం కారణంగా పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ లక్షల్లో నష్టపోతోంది. లాంగ్‌‌టర్మ్‌‌ లీజ్‌‌ కారణంగా అద్దె పెంచలేని పరిస్థితి నెల కొంటోంది. ఎలాగూ అద్దె వస్తుంది కదా అని పర్యవేక్షణ కరువవుతోంది. కాగా టెండర్‌‌‌‌ దక్కించుకున్న వారు మాత్రం ఈజీగా డబ్బు సంపాదించ గలుగుతున్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి, కొత్తగా టెండర్‌‌‌‌ పిలవాలని స్థానికులు కోరుతున్నారు. లీజు గడువు కూడా తక్కువగా ఉంటే బాగుంటుందంటున్నారు.