చీపురు పట్టిన కలెక్టర్.. దహెగాం పీహెచ్సీలో ఒకరు సస్పెన్షన్.. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు

చీపురు పట్టిన కలెక్టర్.. దహెగాం పీహెచ్సీలో ఒకరు సస్పెన్షన్.. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు

దహెగాం, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత చీపురు పట్టింది. జిల్లాలోని దహెగాం మండలంలో శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేపట్టారు. హాస్పిటల్ చుట్టుపక్కలా పిచ్చిమొక్కలు, చెత్త, ప్లాస్టిక్ తో నిండిపోయి ఉండడం చూసి మెడికల్​ ఆఫీసర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీరు మారరు అంటూ స్వయంగా ఆమె చీపురు చేతపట్టి ఊడ్చేశారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ.. వైద్యం కోసం పీహెచ్​సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఒప్పంద పద్ధతిన పని చేస్తూ విధులకు గైర్హాజరైన డాటా ఎంట్రీ ఆపరేటర్ రావూజీ ని విధుల నుంచి తొలగించాలని, ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ల్యాబ్ టెక్నీషియన్స్ సందీప్, వినోద్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు.