పరువు పోతుందని భయపడొద్దు.. మౌనం వీడి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: డీజీ చారుసిన్హా

పరువు పోతుందని భయపడొద్దు.. మౌనం వీడి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: డీజీ చారుసిన్హా
  • మహిళల రక్షణకు పురుషులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: విమెన్ సేఫ్టీ వింగ్‌‌ డీజీ చారుసిన్హా
  •     10 శాతం మంది మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారు
  •     పరువు పోతుందని భయపడి ముందుకు రావడం లేదు
  •     బాధితులు మౌనం వీడి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన
  •     200 మందితో ‘స్టాండ్​ విత్​ హర్​’ కార్యక్రమం

హైదరాబాద్‌‌, వెలుగు: సోషల్‌‌ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని విమెస్ సేఫ్టీ వింగ్‌‌ డీజీ చారుసిన్హా అన్నారు. పరువు పోతుందనే భయంతో బాధితులు సహా తల్లిదండ్రుల కేవలం 10 శాతం మంది మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌‌లైన్‌‌ వేధింపుల విషయంలో బాధితులు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. 

‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో భాగంగా ‘డిజిటల్‌‌ డిగ్నిటీ, రెస్పెక్ట్‌‌ – -ఆన్‌‌లైన్‌‌ హెరాస్‌‌మెంట్‌‌ ’ అనే అంశంపై వివిధ మెడికల్‌‌, ఇంజినీరింగ్‌‌ కాలేజీలకు చెందిన 200 మంది విద్యార్థినులతో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులతో విమెన్ సేఫ్టీ వింగ్‌‌ డీజీ చారుసిన్హా మాట్లాడారు. ఆన్‌‌లైన్‌‌ వేధింపుల గురించి ఫీడ్ బ్యాక్‌‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా చారుసిన్హా మాట్లాడుతూ.. సోషల్‌‌ మీడియాలో మహిళలను, విద్యార్థినులను అసభ్యకరమైన వ్యాఖ్యలు, పోస్టులతో వేధిస్తున్నారని, లైంగిక వేధింపులకు దిగుతున్నారని అన్నారు.

పురుషులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలి

సోషల్‌‌ మీడియా, వర్క్‌‌ ప్లేస్‌‌తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతులపై పెరిగిపోతున్న వేధింపులను నివారించేందుకు క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నామని చారుసిన్హా తెలిపారు. మహిళల బాడీ షేమింగ్‌‌కు పాల్పడడం, ఎగతాళి చేసేలా.. గౌరవాన్ని దెబ్బతీసే విధంగా హేళన చేస్తూ  మెసేజ్‌‌లు, ఫొటోలు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌‌లైన్‌‌ వేధింపులను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను విద్యార్థినులకు వివరించారు. 
డిజిటల్‌‌ కల్చర్‌‌ మారాల్సిన అవసరం ఉందని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీమ్స్‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. యువతను ప్రోత్సహించడం సహా అనేక అంశాలను ఈ సమీక్షలో చర్చించారు. మహిళల భద్రత అనేది ఒక సామూహిక సామాజిక బాధ్యత అని, లైంగిక వేధింపుల ఘటనలు గుర్తిస్తే వెంటనే చుట్టుపక్కల పురుషులు జోక్యం చేసుకోవాలని అన్నారు. యువత, పురుషులు.. మహిళల రక్షణ కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు. 

ఆన్‌‌లైన్ వేధింపుల బాధితుల ఆవేదన

ఈ క్యాంపెయిన్‌‌లో పాల్గొన్న ఆన్‌‌లైన్‌‌ వేధింపుల బాధితులు కొందరు.. తాము ఎదుర్కొన్న అనుభవాలు పంచుకున్నారు. 26 ఏండ్ల ఒక మహిళ తాను సొంత వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు చాలా మంది పురుషులు ఆన్‌‌లైన్‌‌లో తనను దూషిస్తూ, అవమానించారని పేర్కొంది. ఆ సమయంలో షీటీమ్స్‌‌ అండగా నిలిచినట్టు తెలిపింది.

 అదేవిధంగా  24 ఏండ్ల ఒక మహిళ, ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తన చెల్లెలి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి, అసభ్యకరమైన వీడియోలు పంపడం వల్ల ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురైందని.. ఆ సమయంలో షీ టీమ్స్‌‌కు ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.  ఈ అవగాహన కార్యక్రమంలో మహిళా భద్రత విభాగం డీఐజీ పరిమళ హన నూతన్‌‌, ఎస్పీ సలీమ, డీఎస్పీ సీతారెడ్డి, ఇన్‌‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.