బొటానికల్ గార్డెన్‌‌‌‌‌‌‌‌ లో ఓపెన్ లైబ్రరీ

బొటానికల్ గార్డెన్‌‌‌‌‌‌‌‌ లో ఓపెన్ లైబ్రరీ
  • అటవీశాఖ సేవలు తెలియజేసేలా  స్టోరీ బోర్డ్ ఏర్పాటు
  •     ప్రారంభించిన టీజీఎఫ్‌‌‌‌‌‌‌‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, ఎండీ సునీత భగవత్

హైదరాబాద్, వెలుగు: సిటీవాసులకు ఆహ్లాదంతోపాటు విజ్ఞానాన్ని పంచేందుకు కొండాపూర్‌‌‌‌‌‌‌‌లోని బొటానికల్ గార్డెన్ సిద్ధమైంది. పచ్చని చెట్ల నీడలో, ప్రశాంత వాతావరణంలో పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఉచిత లైబ్రరీ, అటవీశాఖ సేవలను వివరించే స్టోరీ బోర్డ్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్​డీసీ) చైర్మన్ పొదెం వీరయ్య, వైస్ చైర్మన్ అండ్​ ఎండీ సునీత భగవత్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడారు. ప్రజలకు, అటవీశాఖకు మధ్య దూరాన్ని తగ్గించి, పర్యావరణంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బొటానికల్ గార్డెన్‌‌‌‌‌‌‌‌ను కేవలం సందర్శక కేంద్రంగానే కాకుండా  విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సందర్శకుల్లో పఠనాసక్తిని పెంచేందుకే ఈ ఓపెన్ లైబ్రరీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక్కడ ఎవరైనా ఉచితంగా పుస్తకాలు చదువుకోవచ్చని వెల్లడించారు. 

ఈ సందర్భంగా లైబ్రరీకి తొలి విడత పుస్తకాలను ఎండీ సునీత భగవత్ స్వయంగా విరాళంగా అందించారు. పౌరులు కూడా తమ వద్ద ఉన్న పుస్తకాలను ఇక్కడ విరాళంగా ఇచ్చి జ్ఞానాన్ని పంచుకోవాలని ఆమె కోరారు. కాగా, అడవులను కాపాడే క్రమంలో అటవీశాఖ అధికారులు పడే కష్టాలు, వారి త్యాగాలను కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన ‘ది లెసర్ నోన్ ఖాకీ’ స్టోరీ బోర్డ్ ఆకట్టుకుంటున్నది. మహారాష్ట్ర క్యాడర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిణి పియూషా జగ్తాప్ దీన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఈడీ రంజిత్ నాయక్, సీజీఎం వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ డాక్టర్ స్కైలాబ్ తదితరులు పాల్గొన్నారు.