
- హైదరాబాద్‌లో అరగంట పాటు ‘ఆపరేషన్ అభ్యాస్’
- పోలీస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో నిర్వహణ
- యుద్ధ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు బుధవారం హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వైమానిక దాడులు జరిగితే ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలి.. సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలి.. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. తదితర అంశాలపై అరగంటపాటు మాక్ డ్రిల్స్ చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్, ఫైర్ ఇంజిన్ల సైరన్ సహా ఇండస్ట్రీస్‌లోని సైరన్లను 2 నిమిషాల పాటు మోగించారు. సాయంత్ర 4 నుంచి 4.30 దాకా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. గోల్కొండ, సికింద్రాబాద్, మౌలాలిలోని ఎన్‌ఎఫ్‌సీ, కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ వద్ద పోలీసులు, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమానికి సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. హోంశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాతో కలిసి మాక్ డ్రిల్స్‌ను సమీక్షించారు.
రెండు నిమిషాల పాటు వార్ సైరన్
కమిషనరేట్ పరిధిలోని 4 ప్రాంతాల్లో జరిగే మాక్ డ్రిల్స్ కోసం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాయంత్రం 4 గంటలకు సీపీ సీవీ ఆనంద్ వార్ సైరన్ ఇచ్చారు. మాక్ డ్రిల్‌లో భాగంగా మిసైల్ అటాక్ జరిగినట్టు పోలీస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ సహా అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. ఇలా 2 నిమిషాల పాటు సిటీలోని అన్ని జంక్షన్లు, అపార్ట్‌మెంట్లు, టూరిస్ట్, రక్షణ రంగ సంస్థలు ఉన్న ప్రాంతాల్లో సైరన్లతో మోతమోగించారు. మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మిసైల్ అటాక్ జరిగినప్పుడు..ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఎలా కాపాడాలి.. మంటలను ఎలా అదుపు చేయాలి.. బాధితులకు వైద్య సేవలు, క్షతగాత్రులను తరలించడంలో అంబులెన్స్‌లకు ట్రాఫిక్ క్లియరెన్స్ సహా తదితర అంశాలపై అవేర్నెస్ కల్పించారు.
రెచ్చగొట్టే పోస్టులు పెడ్తే చర్యలు: సీపీ సీవీ ఆనంద్
‘‘55 ఏండ్ల తర్వాత వార్ సైరన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. వార్ సైరన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు మాక్ డ్రిల్స్‌తో అత్యవసర విభాగాల్లోని లోపాలను సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది” అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై నిఘా పెట్టామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. రెచ్చగొట్టే పోస్టింగ్స్, ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.