
పాకిస్తాన్ లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల పరిస్థితుల కారణంగా పలు ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది. బార్డర్ లో పలు స్కూళ్లు మూసివేశారు.
మూసివేసిన ఎయిర్ పోర్టులు
ధర్మశాల (DHM), లేహ్ (IXL), జమ్మూ (IXJ), శ్రీనగర్ (SXR), అమృత్‌సర్ (ATQ) వంటి కీలక ఎయిర్ పోర్టులలతో విమాన కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. కేంద్ర నిర్ణయంతో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది, అధికారులు ప్రయాణీకులు విమానాశ్రయానికి వెళ్లే ముందు వారి విమానయాన సంస్థలతో తనిఖీ చేసుకోవాలని సూచించారు.
జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్ మరియు రాజ్‌కోట్ - తొమ్మిది నగరాలకు అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. అమృత్‌సర్‌కు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీకి మళ్లించారు. అంతేకాకుండా ఎయిర్‌ఫీల్డ్ మూసివేయబడినందున ఈ రోజు శ్రీనగర్ విమానాశ్రయం నుంచి ఎటువంటి పౌర విమానాలు నడపబడవని అధికారులు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకరాంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. వీటిలో నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం అయిన బహవల్పూర్ కూడా ఉంది.