- టెక్నాలజీ వాడకంలో ఫారెస్ట్ ఆఫీసర్లు విఫలమవుతున్నారని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ఓ పెద్దపులి కొంతకాలంగా ఇటు ప్రజలకు.. అటు ఫారెస్ట్ ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరిన మగ పులి పెనుగంగా నది దాటి మన రాష్ట్రంలో అడుగు పెట్టింది. వాగులు, వంకలు, కొండలు, గుట్టలను సైతం దాటుకుంటూ ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించింది. కొన్ని రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని అటవీ ప్రాంతాలు, గ్రామాల శివార్లలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.
ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియక రైతులు, గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల ఓ పశువుపై దాడి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, పులి సంచారాన్ని నిర్ధారించిన ఫారెస్ట్ ఆఫీసర్లు.. దానిని ట్రాక్ చేయడంలో మాత్రం ఫెయిలవుతున్నారనే విమర్శలున్నాయి. పులి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నా.. అధికారులు కేవలం పాదముద్రలను బట్టి టైగర్ సంచరిస్తుందని చెప్తున్నారే తప్ప.. దాని కదలికలు పసిగట్ట లేకపోతున్నారు.
ప్రస్తుత కాలంలో వన్యప్రాణుల కదలికలను పసిగట్టడానికి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. శాటిలైట్ సిగ్నల్స్, డ్రోన్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల ద్వారా పులి ఎక్కడుందో కనిపెట్టవచ్చు. కానీ, మన దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లు టెక్నాలజీ వాడకంలో వెనుకబడిపోయారనే విమర్శలున్నాయి. పాదముద్రలు, విసర్జితాలు వంటి వాటిపై ఆధారపడటంతో సమయం వృథా అవుతుండగా.. పులి మాత్రం దాని స్థావరాలు మార్చుకుంటూ ముందుకెళ్తోంది. డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేసి ఉంటే ఈపాటికే దాని కదలికలపై స్పష్టత వచ్చేదని వన్యప్రాణి నిపుణులు అంటున్నారు.
తడోబా, తిప్పేశ్వరం తరహా నిఘా కరువు
మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వరం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లలో పులుల సంరక్షణ, ట్రాకింగ్ సిస్టమ్ పటిష్టంగా ఉంటుంది. అక్కడ పులుల మెడకు రేడియో కాలర్లు ఉండటంతోపాటు అటవీ శాఖ నిరంతరం సీసీ కెమెరాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని మానిటర్ చేస్తారు. కానీ, మన దగ్గర అలాంటి నిఘా వ్యవస్థ లేకపోవడం పులి కదలికలు పసిగట్ట లేకపోతున్నారని తెలుస్తోంది. సరిహద్దులు దాటి వచ్చిన పులిని ట్రాక్ చేయడానికి మన దగ్గర సరైన నెట్‌వర్క్ లేకపోవడంతో అది ఎటు వెళ్తుందో అంచనా వేయడంలో ఆఫీసర్లు విఫలమవుతున్నారు. అయితే, ఈ పులి వందల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణం చేస్తుందనేది చర్చానీయాంశంగా మారింది.
మగ పులులు సాధారణంగా రెండు కారణాలతో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తాయని వన్యప్రాణి నిపుణుల చెప్తున్నారు. ఒకటి తావు కోసం (టెరిటరీ) లేదా ‘మేట్’ (ఆడ పులి తోడు) కోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తుందంటున్నారు. ప్రస్తుతం సంచరిస్తున్న పులి తన తావు వెతుక్కుంటూ వచ్చిందా? లేక ఆడ పులి జత కోసం అన్వేషిస్తూ వచ్చిందా? అన్నది తేలాల్సి ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్లు అధునాతన పద్ధతుల్లో ఆపరేషన్ చేపట్టి పులిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
