పల్లెల్లో EESL​కు ఎల్ఈడీ లైట్ల నిర్వహణ.. వ్యతిరేకిస్తున్నసర్పంచ్ లు

పల్లెల్లో EESL​కు ఎల్ఈడీ లైట్ల నిర్వహణ.. వ్యతిరేకిస్తున్నసర్పంచ్ లు
  • ఈఈఎస్ఎల్​కు ఎల్ఈడీ లైట్ల నిర్వహణ
  • వ్యతిరేకిస్తున్న సర్పంచ్ లు.. తీర్మానాలకు నో
  • ఇప్పటి వరకు తీర్మానం  చేసింది పదిశాతమే

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో వీధి లైట్ల నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్​లిమిటెడ్(ఈఈఎస్ఎల్)​కు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్పంచ్ ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి పంచాయతీలో తీర్మానం చేసి పంపించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలపై సర్పంచ్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈఈఎస్ఎల్ కు అప్పగింతకు వ్యతిరేకంగా పలు మండలాల్లో సర్పంచ్​లు తీర్మానాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో సర్పంచ్​లంతా కలిసి వ్యతిరేక తీర్మానాన్ని ఎంపీడీవోకు అందజేశారు. కారేపల్లి మండలంలో పార్టీలకు అతీతంగా సర్పంచ్​లు సమావేశమై, ఈ ఆలోచనకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. తమ హక్కులను హరించే ఇలాంటి తీర్మానాలు చేయబోమంటూ కొన్నిచోట్ల మండల అధికారులకు సర్పంచ్​లు తేల్చి చెబుతున్నారు. దీంతో పలు జిల్లాల్లో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈఈఎస్ఎల్ కు అప్పగించడం వల్ల గ్రామాలకు, సర్పంచ్​లకు ఎలాంటి నష్టం ఉండదంటూ సర్పంచ్ లను మోటివేట్ చేస్తున్నారు. ఓవైపు త్వరగా తీర్మానాలు చేయించాలని అధికారులు ప్రయత్నిస్తుండగా, సర్పంచ్ లు మాత్రం వాట్సప్​ గ్రూపుల్లో ఒప్పందాలు, తీర్మానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

ఏడేళ్లకు అగ్రిమెంట్​

రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామ పంచాయతీల్లో ఏడేళ్ల పాటు స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతను ఈఈఎస్ఎల్​కు అప్పగిస్తూ గత నెలలో పంచాయతీ రాజ్​ శాఖ అగ్రిమెంట్​చేసుకుంది. దీని ప్రకారం గ్రామాల్లో ఏడేళ్ల పాటు ఎల్​ఈడీ లైట్ల ఏర్పాటు, మెయింటెనెన్స్​ఈఈఎస్ఎల్ చూస్తుంది. నేషనల్​ ఎలక్ట్రికల్ కోడ్​ప్రమాణాలకు అనుగుణంగా స్ట్రీట్ లైట్లు ఉన్నాయో లేదో పరిశీలించి కొత్తవాటిని ఏర్పాటు చేస్తారు. సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్​గా ఆన్​అయ్యి, తెల్లవారగానే ఆఫ్​అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. వీటికి అయ్యే బిల్లులను ఏడేళ్లలో ఈఎంఐ పద్ధతిలో పంచాయతీలు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కరెంట్ బిల్లులను మాత్రం ఎప్పటికప్పుడు స్థానిక పంచాయతీలు చెల్లించాలి. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి పంచాయతీ నుంచి తీర్మానాన్ని తెప్పించాలని డీపీవోలకు పంచాయతీరాజ్​ శాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 28లోగా తీర్మానాలు పంపించాలన్న ఆదేశాలపై ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 10 శాతం మంది మాత్రమే స్పందించారు. గడువు దాటి మూడు రోజులవుతున్నా మొత్తం 584 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం వరకు కేవలం 52 జీపీల నుంచి మాత్రమే తీర్మానాలు అందాయి. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు వల్ల కరెంట్ ఆదా కావడంతో పాటు, పంచాయతీలకు బిల్లుల భారం తగ్గుతుంది. మాటిమాటికి లైట్లు కాలిపోయాయంటూ గ్రామాల్లో చేసే దుబారా ఖర్చుకు బ్రేక్​ పడుతుంది. అయితే గతంలో మంచినీటి కోసం గ్రామాల్లో మోటార్లు ఉండగా, మిషన్​ భగీరథతో అవి మూలన పడ్డాయి. పంచాయతీరాజ్​ చట్టం ప్రకారం పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అధికారాలు సర్పంచ్​లకు ఉంటాయని, ఆ అధికారాలకు కత్తెర పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సర్పంచ్​లు అంటున్నారు. ఇప్పుడు మొక్కలు నాటడం, సంరక్షించడం, చెత్త సేకరణ తప్ప ఇతర పనులేం లేకుండా ప్రభుత్వం లాక్కుంటోందని కొందరు సర్పంచ్​లు కామెంట్ చేస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

వీధి లైట్ల నిర్వహణకు సంబంధించిన తీర్మానాలపై సర్పంచ్​ లకు అవగాహన కల్పిస్తున్నాం. ఈఈఎస్ఎల్ అనేది ప్రైవేట్ సంస్థ అనే అపోహతో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే విషయాన్ని అధికారుల ద్వారా సర్పంచ్​లకు వివరంగా చెబుతున్నాం. మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయాలని వివరిస్తున్నాం. ఇప్పటి వరకు 52 జీపీల నుంచి తీర్మానాలు అందాయి. నాలుగైదు రోజుల్లో అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు తెప్పించి ప్రభుత్వానికి పంపిస్తాం.

– శ్రీకాంత్, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం

ప్రజలకు ఏ సేవలందించాలి

గ్రామాల్లో ప్రతి చిన్న సమస్యకు ప్రజలు సర్పంచ్ ని ఆశ్రయిస్తారు. శానిటేషన్, వీధి లైట్లు ఏర్పాటు వంటి పనులు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో జరగకపోతే గ్రామ ప్రజలకు మేం ఎలా సేవలందించాలి. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీ సాధారణ సమావేశంలో తీర్మానం చేశాం.

– ప్రమీలాదేవి, కిష్టయ్య బంజర సర్పంచ్, కల్లూరు మండలం, ఖమ్మం

కాంట్రాక్ట్​ పద్ధతితో చెడ్డపేరు వస్తది

విద్యుత్ దీపాలు, మంచి నీటి సమస్యలు సర్పంచ్ కి తెలిసినంతగా వేరొకరికి తెలియదు. కాంట్రాక్ట్ పద్ధతి వల్ల గ్రామాల్లో సర్పంచ్ కి, పాలకవర్గానికి, ప్రభుత్వానికి, అధికారులకి చెడ్డపేరు వస్తుంది. గ్రామంలో బల్బ్ కాలిపోతే ప్రజలు సర్పంచ్​ను అడుగుతారు తప్పించి, కంపెనీ ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్​కి కాల్ చేస్తరా.. అందుకే మండలంలోని 22 గ్రామాల  సర్పంచ్ లంతా కలిసి ఈ తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఎంపీడీవో, ఎంపీవోకు అందించాం.

– సాధం రామారావు,
సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు, వైరా, ఖమ్మం