హైదరాబాద్, వెలుగు: సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఆప్టిమమ్ సొల్యూషన్స్, జపాన్‌కు చెందిన ఏబీమ్ కన్సల్టింగ్ హైదరాబాద్, చెన్నైలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) గురువారం ప్రారంభించాయి. ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్లౌడ్ మైగ్రేషన్ వంటి సేవలను ఈ కేంద్రాలు అందిస్తాయి.
2030 నాటికి వీటిలో రెండు వేల మంది నిపుణులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జపాన్ సంస్థలు ఏఐ ఆధారిత వ్యాపార నమూనాల వైపు మళ్లుతున్న సమయంలో ఈ జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు సంస్థల వార్షిక ఆదాయం కలిపి 1.5 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వీరికి 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
భారతీయ టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకుని అంతర్జాతీయ స్థాయి పరిష్కారాలను అందించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని ఈ రెండు కంపెనీలు తెలిపాయి.
