ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, ట్రిబుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ మధ్య శాటిలైట్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు !..మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లు కట్టించే యోచన

ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, ట్రిబుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ మధ్య శాటిలైట్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు !..మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లు కట్టించే యోచన
  •  అఫర్డబుల్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ పాలసీపై కసరత్తు
  •  వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రుణాలు
  •   గ్రేటర్‌‌‌‌‌‌‌‌తో పాటు కార్పొరేషన్లలో కొత్తగా జీ ప్లస్ 3 పద్ధతిలో ఇండ్ల నిర్మాణం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఇల్లు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అఫర్డబుల్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ పాలసీని రూపొందిస్తోంది. ఈ పాలసీ అధ్యయనం కోసం జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ, హౌసింగ్, డీటీసీపీ ఆఫీసర్లతో ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

విజన్‌‌‌‌‌‌‌‌ 2047 ప్లాన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఈ పాలసీకి హౌసింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జీ ప్లస్‌‌‌‌‌‌‌‌ 3 పద్ధతిలో నిర్మించనున్న ఇండ్ల వివరాలను హౌసింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ పాలసీలో స్పష్టంగా పేర్కొంది.

 ప్రభుత్వం తీసుకొస్తున్న ప్యూర్, క్యూర్, రేర్‌‌‌‌‌‌‌‌లో భాగంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను సైతం ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించారు. స్లమ్‌‌‌‌‌‌‌‌ ఏరియాలను అభివృద్ధి చేయడంతో పాటు ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీలో గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం వంటి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అయిన టైర్‌‌‌‌‌‌‌‌ 2, 3 సిటీల్లో సైతం టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది.

మధ్య తరగతి ప్రజల కోసం...

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జంట నగరాల్లో ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఇండ్లు కొనే పరిస్థితి లేకుండా పోయింది. సిటీకి దూరంగా అయినా అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ కొనాలంటే రూ. 60 లక్షలకు తక్కువ దొరకడం లేదు. 

ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల కోసం అఫర్డబుల్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ పాలసీని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నుంచి రీజినల్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వరకు మధ్యలో శాటిలైట్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను నిర్మించనుంది. 

ఈ రెండు రోడ్ల మధ్య సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. శాటిలైట్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు నోడల్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. 

ఈ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు నుంచి రూ. 500 కోట్లు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ నుంచి మరో రూ. 600 కోట్లు ఖర్చు చేయనున్నారు.  అలాగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఏడీబీ (ఆసియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌) సైతం ఈ ప్రాజెక్టులను ఆమోదించి, రుణాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ప్లాన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 

టెండర్లు పిలిచి పీపీపీ పద్ధతిలో ఈ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం చేపట్టి మార్కెట్‌‌‌‌‌‌‌‌ ధరల కంటే తక్కువకు ఇండ్లను అందుబాటులో ఉంచనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం హెచ్‌‌‌‌‌‌‌‌ఐజీ (హై ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్), ఎంఐజీ (మిడిల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌కం గ్రూప్‌‌‌‌‌‌‌‌) కాలనీలను ప్రభుత్వం నిర్మించింది. ఇదే తరహాలో ఇప్పుడు శాటిలైట్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను నిర్మించనున్నారు. వీటితో పాటు కేపీహెచ్‌‌‌‌‌‌‌‌పీ ఫోర్త్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ఐజీ క్వార్టర్స్, కుందన్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌లో శిథిలావస్ధకు చేరుకున్న క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ను సైతం కూల్చి కొత్త క్వార్టర్స్ కట్టాలని ప్రభుత్వం విజన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

మరో మూడు లక్షల ఇండ్ల నిర్మాణం

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జీ ప్లస్‌‌‌‌‌‌‌‌ 3 టవర్లలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీలో 19 స్లమ్‌‌‌‌‌‌‌‌ ఏరియాలను గుర్తించారు.

 ఈ పనులకు కొత్త ఏడాదిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ఖర్చు రూ. 5 లక్షలు అవుతుండగా.. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, కార్పొరేషన్లలో రూ. 7 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తొలిదశలో మొత్తం 3.39 లక్షల ఇండ్లు మంజూరు కాగా.. ఇందులో 2.39 లక్షల ఇండ్ల నిర్మాణం మొదలైంది. ఇప్పటివరకు 46 వేల ఇండ్ల స్లాబ్స్‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాయి. 

వచ్చే నాలుగు నెలల్లో లక్ష మంది గృహప్రవేశాలు చేసేలా పనులు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా జరుగుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. మరో లక్ష ఇండ్లకు స్లాబ్స్ పూర్తి కానున్నాయని అంటున్నారు. ఇందుకు రూ. 7,350 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా..  ఇందులో హడ్కో నుంచి రూ. 5 వేల కోట్ల లోన్, కేంద్రం నుంచి పీఎం అవాస్ యోజన స్కీమ్ కింద రూ. 360 కోట్లతో పాటు ఉపాధి హామీ, స్వఛ్చ భారత్ నుంచి నిధులు సమీకరించనున్నట్లు హౌసింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ విజన్‌‌‌‌‌‌‌‌ 2047 ప్లాన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.