ఏపీలో తెలంగాణ స్టూడెంట్ల నిర్బంధం!

ఏపీలో తెలంగాణ స్టూడెంట్ల నిర్బంధం!
  • హిడ్మా ఎన్​కౌంటర్ నిజనిర్ధారణ కోసం వెళ్లిన ఓయూ, కేయూ విద్యార్థులు
  • మారేడుమిల్లికి 40 కి.మీ దూరంలోనే అడ్డుకున్న పోలీసులు
  • చింతూరు పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి 9 గంటల పాటు నిర్బంధం

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్​కౌంటర్ నిజనిర్ధారణ కోసం వెళ్లిన తెలంగాణ స్టూడెంట్స్​ని అక్కడి పోలీసులు 9 గంటల పాటు నిర్బంధించారు. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలోనే వీరిని అడ్డకొని చింతూరు పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎటూ కదలనివ్వకుండా ఠాణాలోనే నిర్బంధించారు. 

తమకేం జరిగినా సంబంధం లేదని బాండ్ పేపర్ మీద రాసిస్తే వెళ్లేందుకు అనుమతిస్తామంటూ బెదిరించారని స్టూడెంట్స్ ఆరోపించారు. స్టూడెంట్స్​ను వెంటనే రిలీజ్ చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్, మానవహక్కుల వేదిక నేతలు డిమాండ్ చేయడంతో సాయంత్రం 5 తర్వాత విడుదల చేశారు. నవంబర్ 18న మారేడుమిల్లిలో జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరికొందరు చనిపోయారు. 

ఇది ఫేక్ ఎన్​కౌంటర్ అనే విమర్శలు వచ్చాయి. వైద్యం కోసం వచ్చినవారిని పట్టుకెళ్లి కాల్చి చంపారని మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఎన్​కౌంటర్​పై నిజనిర్ధారణ కోసం 12 మంది ఓయూ, కేయూ విద్యార్థులు సాయుధ, లెనిన్, విజయ్, తనూష్, కార్తీక్, శ్రవణ్, పవన్, రాజశేఖర్, క్రాంతి కిరణ్, రవిచంద్ర ఒక టీమ్​గా ఏర్పడి గురువారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ నుంచి ఒక ప్రైవేట్ వెహికల్​లో చింతూరు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు వీరి వెహికల్ మారేడుమిల్లి వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని  చింతూరు పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు. 9 గంటల పాటు పోలీస్ స్టేషన్​లోనే నిర్బంధించారు. 

సాయంత్రం విడుదల చేసి తెలంగాణవైపు పంపించారు. భద్రాచలం వెళ్లేదాకా ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు ఉన్న రెండు వెహికల్స్​తో ఫాలో చేశారు. విద్యార్థులను నిర్బంధించడాన్ని ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శి వై రాజేశ్ ఖండించారు. స్టూడెంట్స్​ను అక్రమంగా నిర్బంధించడంపై సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.