గాంధీ ఆస్పత్రిలో కరోనా సిబ్బంది తొలగింపు

గాంధీ ఆస్పత్రిలో కరోనా సిబ్బంది తొలగింపు
  • 244 మందికి టర్మినేషన్​ లెటర్లు​
  • కాంట్రాక్టు పొడిగింపునకు రాష్ట్ర సర్కారు నో

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఒప్పందంపై పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారిని విధుల నుంచి సడెన్​గా తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు కంపెనీలతో వారికి టర్మినేషన్  లెటర్లు జారీ చేయించింది. ‘‘ఏప్రిల్  1 నుంచి డ్యూటీలకు రావద్దు. మీ కాంట్రాక్టు​అయిపోయింది. మిమ్మల్ని తొలగిస్తున్నాం” అంటూ కాంట్రాక్టు కంపెనీలు శుక్రవారం  గాంధీలోని 244 మంది పేషెంట్ కేర్  ఔట్ సోర్సింగ్​ సిబ్బందికి టెర్మినేషన్​ లెటర్లు పంపించాయి. దీంతో పాటు తొలగించబడిన సిబ్బంది వివరాల జాబితాను ఆసుపత్రి గోడకు అతికించారు. కరోనా టైంలో కొవిడ్​ నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్​ పేషెంట్లకు సేవలందించేందుకు ప్రభుత్వం 244 మందిని ఔట్​సోర్సింగ్ పద్ధతిన 2020 మే నెలలో ఏడాది కాలానికి నియమించింది. ఆ తర్వాత రెం డు, మూడో దశ కరోనా వ్యాప్తి దృష్ట్యా వారి సర్వీసును రెండేండ్ల పాటు పొడిగించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వారిని విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తొలగింపు అన్యాయం: బాధితులు

టర్మినేషన్​ లెటర్లు అందుకున్న సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించి, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.అనంతరం గాంధీ సూపరింటెండెంట్​ రాజారావును కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్బంగా వారు మీడి యాతో మాట్లాడారు. అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న టైంలో తాము ప్రాణాలకు తెగించి సేవలు చేస్తే, ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం ఇదా అం టూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తమతో కలిసి పనిచేసిన ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.ఇప్పుడు కరోనా సమస్య లేదన్న సాకుతో తమను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. 

ఇబ్బంది లేకుండా చూస్తం

కరోనా పేషెంట్లకు సేవలందించేందుకు ఔట్ సోర్సింగ్ పద్దతిన వారిని విధుల్లోకి తీసుకున్నాం. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా మారినందున ప్రభుత్వ సూచనల మేరకు కొవిడ్​-19 పేషెంట్​కేర్​ సిబ్బంది సర్వీసును పొడిగించడం లేదు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.
–సూపరింటెండెంట్