ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం అడ్డదారులు.. వంద ప్రైవేట్ కాలేజీల ఫేక్ దందా

ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం అడ్డదారులు.. వంద ప్రైవేట్ కాలేజీల ఫేక్ దందా
  • అఫిలియేషన్ల కోసం నకిలీ ఫైర్ ఎన్ఓసీలు 
  • తనిఖీల్లో ఇంటర్ బోర్డు అధికారుల గుర్తింపు
  • ఆయా కాలేజీలపై చర్యలకు రంగం సిద్ధం.. 
  • తప్పుడు ప్రచారం, వసతుల లేని కాలేజీలపై పెనాల్టీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతూ.. నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపాయి. ఐదు, పది కాలేజీలు కాదు.. ఏకంగా వందకు పైగా కాలేజీలు ఫేక్ ఎన్​ఓసీలు పెట్టడంపై ఇంటర్ బోర్డు అధికారులు సీరియస్ అయ్యారు. హైడ్రా సహకారంతో ఈ బాగోతాన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు వాటికి చెక్ పెడుతోంది.

ఆ కాలేజీలపై భారీగా ఫైన్లు వేయడంతో పాటు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. స్టేట్ లో 3,400 జూనియర్ కాలేజీలు ఉండగా.. ప్రస్తుతం అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని సర్కారు కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. 1,400 ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికీ సుమారు వెయ్యి కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చింది. కాలేజీల గుర్తింపు ప్రక్రియలో మేనేజ్మెంట్లు సమర్పించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైమ్​లో అధికారులకు ఫైర్ ఎన్​ఓసీలపై అనుమానం వచ్చింది. 

కొందరు ఫేక్ ఎన్​ఓసీలపై ఫిర్యాదు చేయడంతో, ఇంటర్ బోర్డుకు మేనేజ్మెంట్లు ఇచ్చిన సర్టిఫికెట్లను పరిశీలన కోసం హైడ్రాకు పంపించారు. ఇప్పటి వరకూ వంద కాలేజీల వరకూ బోగస్ ఎన్​ఓసీలతో అఫిలియేషన్ కోసం అప్లై చేసుకున్నట్టు హైడ్రా అధికారులు ఇంటర్ బోర్డుకు సమాచారం ఇచ్చారు. గతేడాది ఇలాగే చేసినట్టు వారి విచారణలో తేలిందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ దొంగ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయింది. ఒరిజినల్ ఎన్ఓసీలు సమర్పిస్తేనే పర్మిషన్ ఇస్తామని, లేదంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. మరోపక్క ఆయా కాలేజీలపై భారీగా ఫైన్లు వేసేందుకు రెడీ అవుతోంది.

బ్రోకర్ దందా..

కొన్ని ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఇవి ఫేక్ ఎన్ఓసీలు అని తెలియక మోసపోగా.. కొందరు తెలిసే పెట్టినట్టు అధికారులు గుర్తించారు. కొందరు బ్రోకర్ ద్వారా హైడ్రా ఫైర్ ఎన్ఓసీ తీసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. దీంట్లో సదరు బ్రోకర్ చాలా మందిని మోసం చేసి, బోగస్ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చినట్టు సమాచారం. దీనిపైనా హైడ్రా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

350 కాలేజీలకు రాని అఫిలియేషన్..

కేవలం ఫైర్ ఎన్ఓసీలతో పాటు మౌలిక వసతుల లేమితో మరో 350 ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు. మరోపక్క ఇప్పటికే సుమారు వంద ప్రైవేటు కాలేజీలకు కోటికి పైగా ఫైన్ వేశారు. వాస్తవ విరుద్ధమైన ర్యాంకులతో టీవీలు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, కనీస ల్యాబ్ సౌకర్యాలు లేకపోయినా ఉన్నట్లు బోర్డును మభ్యపెట్టడం వంటి వాటిపై లక్ష నుంచి పది లక్షల వరకూ ఫైన్ వేశారు. ఫైన్లు పడిన కాలేజీల్లో దాదాపు కార్పొరేట్ కాలేజీలే ఉండటం గమనార్హం.

నిబంధనలు పాటిస్తేనే గుర్తింపు

విద్యార్థుల భద్రత మాకు ముఖ్యం. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ పడబోం. ఇప్పటికే తనిఖీల్లో వంద కాలేజీలు ఫేక్ ఎన్ఓసీలు పెట్టినట్టు గుర్తించాం. ఒరిజినల్ ఎన్ఓసీలు తెచ్చుకుంటేనే అఫిలియేషన్ ఇస్తామని చెప్పాం. గుర్తింపు లేకుండా నడిచే కాలేజీలపై చర్యలు తీసుకుంటాం. అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత కూడా మరోసారి తనిఖీలు నిర్వహిస్తం.  

-అభిలాష అభినవ్, ఇంటర్ బోర్డు సెక్రటరీ