ఫ్రాన్స్, స్పెయిన్‌లో భీకర కార్చిచ్చు.. 2.67 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఫ్రాన్స్, స్పెయిన్‌లో భీకర కార్చిచ్చు.. 2.67 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఫ్రాన్స్ , స్పెయిన్ దేశాలను భీకర కార్చిచ్చు దహించివేస్తోంది. గత మూడు రోజులు  ఆరని జ్వాలలు ఈ రెండు దేశాల్లో అడవులు, నివాస ప్రాంతాలను కాల్చి బూడిద చేస్తున్నాయి.  చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విపత్కర పరిస్థితిని ఈ రెండు దేశాలు  ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఎండలు వీటికి తోడు బలమైన గాలులతో ఈ మంటలు మరింత ప్రమాదకరంగా మారాయి. ఒక ప్రాంతంలో ప్రారంభమైన మంటలు కేవలం కొన్ని గంటల్లోనే వందల కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ అడవులతో పాటు జనావాసాలు, పర్యాటక ప్రాంతాలను కూడా బూడిద చేస్తున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 

ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఈ భీకర కార్చిచ్చు 2026 జూలై 24 సాయంత్రం నుంచిప్రారంభమై గత కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చింది. తీవ్రమైన వేడి, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా ఈ మంటలు అదుపులేకుండా వేగంగా విస్తరిస్తున్నాయి. 

అధికారుల సమాచారం ప్రకారం.. ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్, జిరోండే ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అక్కడి నుంచి సుమారు 1లక్షా 97వేల మందిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే సమయంలో స్పెయిన్‌లో రాజధాని మాడ్రిడ్ సమీపంలోని అనేక గ్రామాల నుంచి 70వేల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. మొత్తంగా రెండు దేశాల్లో ఇప్పటివరకు 2లక్సల 67వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది.

ఈ కార్చిచ్చు కారణంగా ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని వాలెన్సియా పరిధిలో ఉన్న మనీసెస్ సిటీలో ఓ వ్యక్తి కార్చిచ్చు మంటల్లోచిక్కుకుని బయటపడలేక  మంటల్లోనే కాలిబూడిదైనట్లు అధికారులు గుర్తించారు. 

తీవ్ర ఎండలతో అడవులు పూర్తిగా ఎండిపోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లింది. ఫ్రాన్స్‌లో దాదాపు 98వేల హెక్టార్ల అడవి బూడిద కాగా, స్పెయిన్‌లో సుమారు 1లక్షా30వేల హెక్టార్ల అటవీ ప్రాంతం మంటల్లో కాలిపోయింది. వేలాది వన్యప్రాణులు వాటి నివాసాలను కోల్పోయాయి. పర్యావరణానికి, జీవవైవిధ్యానికి ఇది తీవ్రమైన దెబ్బఅంటున్నారు  నిపుణులు.

పరిస్థితి అదుపు తప్పడంతో స్పెయిన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా కార్చిచ్చు కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంటలు రాజధాని మాడ్రిడ్ వైపు విస్తరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా అత్యవసర చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సహాయంగా సైన్యాన్ని రంగంలోకి దించారు. మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక రసాయనాలను చల్లే A400M మిలిటరీ రవాణా విమానాలను వినియోగిస్తున్నారు. భూమిపై వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, వందలాది అగ్నిమాపక వాహనాలు నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

అడవుల్లో మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు యూరోపియన్ యూనియన్ సహాయాన్ని కూడా కోరాయి. స్పందించిన ఇటలీ, గ్రీస్, పోర్చుగల్, జర్మనీ, క్రొయేషియా వంటి దేశాలు ప్రత్యేక హెలికాప్టర్లు, వాటర్ బాంబర్ విమానాలను పంపి మంటలను ఆర్పే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ సహకారం ప్రస్తుతం కొనసాగుతోంది.

వాతావరణ నిపుణులు వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మంటలు అంత తీవ్రంగా ఉన్నాయంటే అవే తమ చుట్టూ ప్రత్యేక గాలి వ్యవస్థను సృష్టిస్తున్నాయి. దీనివల్ల మంటలు అనూహ్యంగా దిశ మార్చుకుంటూ అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గడం, గాలిలో తేమ పెరగడం వల్ల మంటలను అదుపు చేసే పనిలో కొంత ఊరట లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన మరోసారి ప్రపంచానికి వాతావరణ మార్పుల తీవ్ర ప్రభావాన్ని గుర్తు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను తగ్గించాలంటే అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల నియంత్రణ వంటి చర్యలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను అదుపు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.