జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం మల్లన్న బోనాల జాతరకు జనం పోటెత్తారు. రాష్ట్రంలో అతిపెద్ద బోనాల జాతరగా ఈ ఉత్సవానికి పేరుంది. బోనాల జాతరకు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయానికి భారీగా భక్తులు చేరుకొని, అక్కడే స్వామి వారికి బోనం వండి సాయంత్రం ఒకేసారి 60 వేల మంది భక్తులు బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. శివ సత్తుల పూనకాలు , ఒగ్గు కళాకారుల డప్పుల మోతలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. అనంతరం రథోత్సవం నిర్వహించారు. - కోరుట్ల, వెలుగు
