జడ్చర్ల టౌన్,వెలుగు: జడ్చర్ల మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యంపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ బాదేపల్లి కార్యదర్శి యాదగిరిని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సస్పెండ్‌చేశారు. మొక్కజొన్న సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలతో ఆయనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ జిల్లా సహకార అధికారి డి. కృష్ణ ఆదేశాలు జారీ చేశారు.
జడ్చర్ల మార్కెట్‌లో పీఏసీఎస్ బాదేపల్లి తరపున కొనుగోలు బాధ్యతలను పీఏసీఎస్ భూత్‌పూర్ లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్ ఆర్. వెంకటేశ్‌కు అప్పగించారు. మార్కెట్‌లో రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తూకాల్లో గందరగోళం, సరైన స్పందన లేకపోవడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
