చివరి గింజ కొనేవరకూ వదిలిపెట్టం.. వడ్ల కొనుగోలులో తప్పుడు లెక్కలు చెబుతుండ్రు

చివరి గింజ కొనేవరకూ వదిలిపెట్టం.. వడ్ల కొనుగోలులో తప్పుడు లెక్కలు చెబుతుండ్రు
  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి
  • 25 శాతం కొని 80 శాతం కొన్నామంటున్నారని ఫైర్


యాదాద్రి/జనగామ/హనుమకొండ/ఆత్మకూరు, వెలుగు :రైతులు పండించిన చివరి గింజ కొనేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ ‘రైతు గోస- బీజేపీ భరోసా’ పేరిట ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన యాత్రలో భాగంగా మంగళవారం యాదాద్రి, జనగామ, హనుమకొండ జిల్లాలో కొనసాగింది.

 యాదాద్రి జిల్లా భువనగిరిలోని వడపర్తి కొనుగోలు సెంటర్, ఆలేరు, జనగామ జిల్లా మార్కెట్​ యార్డులో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, రామారావు పటేల్, వెంకట రమణా రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి వడ్ల కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. 

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్​ పరిశీలించారు.

 నెల రోజులు గడుస్తున్నా.. వడ్లను కొనుగోలు చేయడం లేదని బీజేపీ బృందానికి రైతులు వివరించారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్​రెడ్డి మాట్లడుతూ వడ్ల కొనుగోలు విషయంలో సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. వచ్చిన దిగుబడిలో ఇప్పటి వరకు సర్కారు 25 శాతమే కొనుగోలు చేసి, 80 శాతం కొనుగోలు చేశామని ప్రకటిస్తూ రైతులను రేవంత్​ సర్కారు మోసం చేస్తోందన్నారు.

 రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అబద్ధపు మాటలు, తప్పుడు లెక్కలను పక్కన పెట్టి.. కొనుగోలు సెంటర్లకు రావాలని సవాల్​ విసిరారు. మక్కలు, జొన్న, సన్‌ ఫ్లవర్  పండించిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. రైతుల సమస్యలపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనుగోలు సెంటర్ల బాట పట్టడంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. తాము వస్తున్నామనే భయంతో లారీలను పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

గజ్వేల్‌కు బీజేపీ బృందం వెళ్లడంతో కలెక్టర్  స్వయంగా వచ్చి 30 లారీలను ఏర్పాటు చేశారని చెప్పారు. తమ రాకతోనే లారీలు వస్తాయంటే.. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడానికి, రైతుల పక్షాన నిలబడడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.