పంట కొనాలన్నా లంచమే..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి

పంట కొనాలన్నా లంచమే..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
  •  బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్

ఆదిలాబాద్/నేరడిగొండ, వెలుగు: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్ చేశారు. సిరికొండ మండలం పొన్న గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని ఎమ్మెల్యేలు అనిల్​యాదవ్​, కోవ లక్ష్మి, కౌశిక్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి శనివారం పరామర్శించారు. 

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రూ.500 బోనస్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. జొన్నలు కొనుగోలు చేయకపోవడంతోనే పాండురంగ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ పార్టీ తరఫున పాండురంగ కుటుంబానికి రూ.3 లక్షలు అందించామని, ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల పరిహారం ఇప్పించే వరకు పోరాడతామని తెలిపారు.