
హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు రామయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. రామయ్య మృతి పట్ల పలువురు ప్రకృతి ప్రేమికులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. ప్రకృతిపై ప్రేమతో జీవితాంతం మొక్కలు నాటిన రామయ్య.. తద్వారా వనజీవిగా పేరుగాంచారు. తన జీవితంలో దాదాపు కోటికి పైగా మొక్కలు నాటి రికార్డ్ సృష్టించిన రామయ్య కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు 2017లో రామయ్యకు పద్మ శ్రీ అవార్డ్ ప్రధానం చేసింది.