హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో మంగళవారం ఒకే రోజు మూడు దేశాలకు చెందిన మహిళలకు అరుదైన రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. వీటిని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్మంజుల అనగాని నిర్వహించారు.
మొదటి కేసులో సింగపూర్‌కు చెందిన 40 ఏండ్ల మహిళ సబ్‌ముకోసల్ ఫైబ్రాయిడ్‌తో (గర్భాశయం లోపలి గదిలో మాంసకండ పెరుగుదల) పాటు గర్భాశయ రక్తస్రావంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు రోబోటిక్ హిస్టరెక్టమీ, బైలేటరల్ సాల్పింగెక్టమీ, అథెసియోలిసిస్ సర్జరీలు సక్సెస్‌ఫుల్‌గా చేశారు.
రెండో కేసులో పోస్ట్-మెనోపాజ్ తర్వాత ఏర్పడే ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియాతో బాధపడుతున్న దుబాయ్‌కు చెందిన 50 ఏండ్ల మహిళకు రోబోటిక్ హిస్టరెక్టమీతో పాటు బైలేటరల్ సాల్పింగో–ఓఫోరెక్టమీ (రెండు వైపులా ఫాలోపియన్ ట్యూబులు, అండాశయాలను తొలగించడం) చేశారు.
మూడో కేసులో మనదేశానికే చెందిన 37 ఏండ్ల మహిళకు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. పెద్ద అండాశయ రక్తస్రావం, ఇంతకుముందు సర్జరీల వల్ల ఏర్పడ్డ అతుకులు ఆమెను బాధించాయి. దీంతో ఈమెకు పలు దశల్లో రోబోటిక్ సర్జరీలు చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
