దావూద్ ఇబ్రహీం‌ మా దేశంలోనే ఉన్నాడు

దావూద్ ఇబ్రహీం‌ మా దేశంలోనే ఉన్నాడు

న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఇండియా చాలాసార్లు ఆరోపించింది. కానీ ప్రతిసారి దీన్ని దాయాది ఖండిస్తూనే వచ్చింది. అయితే మొత్తానికి పాకిస్తాన్ దిగొచ్చింది. ప్యారిస్ బేస్డ్‌ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్​) సంస్థ ఆర్థిక ఆంక్షలు విధిస్తుందేమోనన్న భయం, ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు దిగొచ్చిన పాక్ దావూద్‌పై నిజాన్ని బయటపెట్టింది.

భారత్ ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ఒప్పుకుంది. కరాచీలో దావూద్ నివసిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం శనివారం తెలిపింది. దీంతో 1993 ముంబై వరుస పేలుళ్లతో సంబంధం ఉన్న దావూద్‌కు ఇన్నాళ్లూ పాక్ ఆశ్రయం ఇచ్చిందనే విషయం తేటతెల్లమైంది. ఎఫ్‌ఏటీఎఫ్​ భయంతో ప్రధాన టెర్రర్ గ్రూపులపై ఆర్థిక ఆంక్షలు విధించామని పాక్ తెలిపింది. హఫీజ్ సయీద్, మసూద్ అజహర్, దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లను సీజ్‌కూడా చేశామని పాక్ పేర్కొంది.