
- రవూఫ్‌ను మతగురువుగా చూపించే యత్నం
ఇస్లామాబాద్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడుల్లో మరణించిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఇంతియాజ్ ఆలమ్‌తోపాటు ఇంకొందరు టెర్రరిస్టుల అంత్యక్రియలకు హాజరైన లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) కీలక నేత హఫీజ్ అబ్దుల్ రవూఫ్ తమ ఫ్యామిలీ మెంబరేనని పాకిస్తాన్ వివరణ ఇచ్చింది. రవూఫ్ మతగురువు కాబట్టే ఆయన ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొంది. పాక్ ఇంటర్ -సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రవూఫ్.. పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్(పీఎంఎంఎల్) కార్యకర్త అని, పాక్ కుటుంబ వ్యక్తి అని చెప్తూ ఆయనకు సంబంధించిన ఐడీకార్డును కూడా మీడియాకు చూపించారు.
అయితే, తాముకూడా టెర్రరిజంపై పోరాడుతున్నామంటూ మభ్య పెడుతున్న పాకిస్తాన్, ఇప్పుడు అధికారికంగా టెర్రరిస్టుల అంత్యక్రియలు నిర్వహిస్తోందని మన దేశం మండిపడింది. అంత్యక్రియలకు గ్లోబల్ టెర్రరిస్ట్ రవూఫ్ కూడా హాజరయ్యాడని, అందుకు సంబంధించిన ఫొటోను వైరల్ చేసింది. దీంతో పాక్ తాజా వివరణ ఇచ్చుకుంది. మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది.
అతను గ్లోబల్ టెర్రరిస్టే: అమెరికా
పాక్ చెప్పిన వివరాలతో సరిపోల్చగా, తాము గతంలో ప్రకటించిన గ్లోబల్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూజ్ ఇతనేనని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ కూడా ఇటీవల ధ్రువీకరించింది. రవూఫ్ గతంలో ఎల్‌ఈటీకి నిధులను సమీకరించేందుకు ఓ ఫౌండేషన్‌ను స్థాపించి, ఆ ఫౌండేషన్ ద్వారా అమెరికా నుంచి అనేకమొత్తంలో నిధులు పొందాడని పేర్కొంది.
టెరర్రిస్టులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించడమే కాకుండా, పీఎంఎంఎల్ వంటి కొత్త పార్టీల ముసుగులో వాళ్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని మన దేశం చాలాకాలంగా ఆరోపిస్తోంది.