
- ఖతర్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహాలో సమావేశం
- చర్చల్లో పాల్గొన్న పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రుల బృందాలు
దోహా(ఖతర్): పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తక్షణమే సీజ్ ఫైర్ ను పాటించాలని రెండు దేశాలూ అంగీకారానికి వచ్చాయి. శనివారం రాత్రి ఖతర్ రాజధాని దోహాలో ఖతర్, తుర్కియే దేశాల మధ్యవర్తిత్వంతో పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రుల బృందాలు భేటీ అయి చర్చలు జరిపాయి. చర్చల అనంతరం కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయని ఖతర్ విదేశాంగ శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. కాల్పుల విరమణ అమలు కొనసాగేలా చూసేందుకు, సరిహద్దు వెంబడి దీర్ఘకాలికంగా శాంతి నెలకొల్పడం కోసం తదుపరి సమావేశాలు నిర్వహించాలని కూడా ఇరుదేశాలూ అంగీకారానికి వచ్చాయని తెలిపింది. దోహా చర్చల్లో తమ దేశం నుంచి రక్షణ మంత్రి ముల్లా ముహ్మద్ యాకూబ్ నేతృత్వంలోని బృందం పాల్గొన్నదని అఫ్గాన్ ప్రకటించింది. తమ దేశం నుంచి రక్షణ మంత్రి ఖవాజా ముహ్మద్ అసిఫ్ నేతృత్వంలోని బృందం చర్చలకు హాజరైనట్టు పాకిస్తాన్ వెల్లడించింది.
వారం రోజులుగా భీకర దాడులు..
అఫ్గాన్ నుంచి టీటీపీ టెర్రరిస్టులు తమ దేశంపై దాడులు చేస్తున్నాయంటూ పాకిస్తాన్ ఇటీవల అఫ్గాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. వారం రోజులుగా పరస్పరం జరిగిన దాడుల్లో ఇరువైపులా అనేక మంది జవాన్లు, పౌరులు చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి. శుక్రవారం పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్ పై అఫ్గాన్ నుంచి టీటీపీ దళాలు బాంబు దాడి చేయడంతో ఏడుగురు పాక్ సోల్జర్లు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. దీంతో అఫ్గాన్ పై పాక్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు సహా 8 మంది చనిపోయారు. క్రికెటర్లపై పాక్ దాడులకు నిరసనగా ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ ను అఫ్గాన్ రద్దు చేసుకున్నది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దోహాలో జరిగిన చర్చల్లో ఇరుదేశాలూ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పాక్, అఫ్గాన్ మధ్య సరిహద్దు వెంబడి వారం రోజులుగా జరుగుతున్న తీవ్ర దాడులు, హింసకు తెరపడినట్టయింది.