
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. దుబాయ్ వేదికగా జరగనున్నఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎప్పటిలాగే ఇండియాతో మ్యాచ్‌కు ముందు ప్రగ్భలాలు పలుకుతున్నారు పాక్ క్రికెటర్లు, ఆ దేశ మాజీలు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ఇండియాకు హెచ్చరికలు పంపాడు. ఇండియాతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని.. తమదైనా రోజు ఇండియానే కాదు ఏ జట్టునైనా ఓడించే సత్తా మాకుందన్నాడు పాక్ కెప్టెన్. ప్రస్తుతం తమ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉందని చెప్పాడు. ఇటీవలే మేం ఒక ట్రై సిరీస్ కూడా గెలిచామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు సల్మాన్ అఘా.
ఆసియా కప్ 2025లో ఇండియా, పాకిస్థాన్ జట్లు గణమైన బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. యూఏఈతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో భారత ఘన విజయం సాధించింది. యూఏఈ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని కేవలం 27 బంతుల్లోనే ఛేదించి టీమిండియా చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా గ్రాండ్ విక్టరీ సాధించింది. పసికూన ఒమన్‌ను 93 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్‌లో బోణీ కొట్టింది.
టోర్నీలో భారీ విజయాలతో ఊపుమీదున్న ఇండియా, పాక్.. సెప్టెంబర్ 14న ముఖాముఖీ తలపడబోతున్నాయి. దాయాదుల పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాలతో ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఈ మ్యాచ్‌పై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.