ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో ఆందోళనలు చేస్తున్న వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపబోమని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. భారత్ లాగే వాళ్లు కూడా తమకు శత్రువులేనని ఆయన పేర్కొన్నారు. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 20కి పెరిగిందని తెలిపారు. ‘‘ఆందోళనకారులతో ఎలాంటి చర్చలు ఉండవు. వారిని నేను భారత్‌తో సమానంగా చూస్తున్నాను. పాకిస్తాన్ వారిని శత్రువుల కేటగిరీలోనే ఉంచుతుంది” అని ఆసిఫ్ పేర్కొన్నారు.
ప్రధాని సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. జేఏఏసీ ప్రతినిధులు తమను కలసి 38 డిమాండ్లను నెరవేర్చాలని కోరారన్నారు. నిరసనకారులు ముజఫరాబాద్, మీర్‌పూర్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఇది భారత్ తరహా దాడి అని ఆరోపించారు. కాగా, పీవోకేలో జరుగుతున్న ఎన్నికలపై భారత్ తీవ్రంగా స్పందించింది. తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి దృష్టి మళ్లించడానికే పాకిస్తాన్ ఈ నాటకమాడుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మండిపడ్డారు.
జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత్‌లో విడదీయరాని అంతర్భాగాలని తెలిపారు. ప్రస్తుతం పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు కూడా భారత్‌వే అని చెప్పారు. పాక్ చేస్తున్న ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కు కాలరాయడం, వేధింపుల వల్లే పీవోకేలో ప్రజా తిరుగుబాటు వచ్చిందని అన్నారు. కాగా, సోమవారం నుంచి జరుగుతున్న ఘర్షణల్లో నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)కి చెందిన దాదాపు 20 మంది కార్యకర్తలు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు.
