ఆసియా కప్‌‌ లో పాకిస్తాన్‌‌ బోణీ... 93 రన్స్‌‌ తేడాతో ఒమన్‌‌పై గెలుపు

ఆసియా కప్‌‌ లో పాకిస్తాన్‌‌ బోణీ... 93 రన్స్‌‌ తేడాతో ఒమన్‌‌పై గెలుపు
  • రాణించిన హారిస్‌‌, ఫర్హాన్‌‌..  బౌలర్ల సూపర్‌‌ షో

దుబాయ్‌‌: ఆసియా కప్‌‌లో పాకిస్తాన్‌‌ బోణీ చేసింది. బ్యాటర్లు, బౌలర్లు సమయోచితంగా రాణించడంతో.. గ్రూప్‌‌–ఎలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో పాక్‌‌ 93 రన్స్‌‌ తేడాతో ఒమన్‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన పాకిస్తాన్‌‌ 20 ఓవర్లలో 160/7 స్కోరు చేసింది. మహ్మద్‌‌ హారిస్‌‌ (43 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 66), సాహిబ్జాదా ఫర్హాన్ (29) మెరుగ్గా ఆడారు. తర్వాత ఒమన్‌‌ 16.4 ఓవర్లలో 67 రన్స్‌‌కే కుప్పకూలింది. హమ్మద్‌‌ మీర్జా (27) టాప్‌‌ స్కోరర్‌‌. ఇన్నింగ్స్‌‌ మొత్తంలో ఎనిమిది మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు.  సైమ్‌‌ అయూబ్‌‌, సూఫియన్‌‌ ముకీమ్‌‌, ఫహీమ్‌‌ అష్రాఫ్‌‌ తలా రెండు వికెట్లు తీశారు. హారిస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

హారిస్‌‌ హాఫ్‌‌ సెంచరీ..

పాక్‌‌ భారీ బ్యాటింగ్‌‌ బలగాన్ని ఒమన్‌‌ బౌలర్లు నిలువరించారు. ఫ్లాట్‌‌ వికెట్‌‌పై రన్స్‌‌ చేసే అవకాశం ఉన్నా.. కీలక టైమ్‌‌లో వికెట్లు తీసి కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కు ఓపెనర్‌‌ సైమ్‌‌ అయూబ్‌‌ (0)ను షా ఫైజల్‌‌ (3/34) దెబ్బకొట్టాడు. 4/1తో కష్టాల్లో పడిన పాక్‌‌ను వన్‌‌డౌన్‌‌లో వచ్చిన హారిస్‌‌ ఆదుకున్నాడు. ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన అతను సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశాడు. రెండో ఓవర్‌‌లోనే తాను ఇచ్చిన క్యాచ్‌‌ను కలీమ్‌‌ వదిలేయడంతో ఫర్హాన్‌‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఇద్దరు స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ ముందుకు సాగారు. ఆరో ఓవర్‌‌లో హారిస్‌‌ 4, 6, 4తో 16 రన్స్‌‌ రాబట్టడంతో పవర్‌‌ప్లేలో పాక్‌‌ 47/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌ విస్తరించిన తర్వాత కూడా హారిస్‌‌ 4, 6, 4, 6, 4 దంచాడు. 

తర్వాతి నాలుగు ఓవర్లలో 38 రన్స్‌‌ రావడంతో పాక్‌‌ 85/1తో ఫస్ట్‌‌ టెన్‌‌ను ముగించింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌లో ఆమిర్‌‌ కలీమ్‌‌ (3/31).. ఫర్హాన్‌‌ను ఔట్‌‌ చేసి రెండో వికెట్‌‌కు 85 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను ముగించాడు. ఫకర్‌‌ జమాన్‌‌ (23 నాటౌట్‌‌) ఫోర్‌‌తో ఖాతా తెరిచినా.. 13వ ఓవర్‌‌లో పాక్‌‌కు డబుల్‌‌ స్ట్రోక్‌‌ తగిలింది. కలీమ్‌‌ వరుస బాల్స్‌‌లో హారిస్‌‌, సల్మాన్‌‌ ఆగా (0)ను పెవిలియన్‌‌కు పంపాడు. స్కోరు 102/4గా మారింది. హారిస్‌‌ 32 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టాడు. 

జమాన్‌‌తో కలిసిన హసన్‌‌ నవాజ్‌‌ (0) ఆచితూచి ఆడాడు. అయినా వికెట్‌‌ కాపాడుకోలేకపోయాడు. 17వ ఓవర్‌‌లో ఫైజల్‌‌ దెబ్బకు నవాజ్‌‌ వెనుదిరిగాడు. ఐదో వికెట్‌‌కు 18 రన్స్‌‌ జతయ్యాయి. వచ్చి రావడంతో ఐదు ఫోర్లతో రెచ్చిపోయిన మహ్మద్‌‌ నవాజ్‌‌ (19) 19వ ఓవర్‌‌లో ఔటయ్యాడు. ఫహీమ్‌‌ అష్రాఫ్‌‌ (8) ఫోర్‌‌తో చివరి ఏడు ఓవర్లలో 58 రన్స్‌‌ రావడంతో పాక్‌‌ మంచి స్కోరే చేసింది. 

బౌలర్లు సమయోచితంగా

ఛేజింగ్‌‌లో పాక్‌‌ బౌలర్ల ధాటికి ఒమన్‌‌ బ్యాటర్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. మంచి లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో చెలరేగిన పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దాంతో రెండో ఓవర్‌‌లో జతిందర్‌‌ సింగ్‌‌ (1)తో మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది. హమ్మద్‌‌ మీర్జా  నిలకడగా ఆడినా రెండో ఎండ్‌‌లో సరైన సహకారం దక్కలేదు. ఆమిర్‌‌ కలీమ్‌‌ (13) కాసేపు పోరాడాడు. మహ్మద్‌‌ నదీమ్‌‌ (3), సూఫియన్‌‌ మహ్మద్‌‌ (1), వినాయక్‌‌ శుక్లా (2), జిక్రియా ఇస్లామ్‌‌ (0), షా ఫైజల్‌‌ (1), హస్నైన్‌‌ షా (1) సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోర్లకే పరిమితమయ్యారు. మధ్యలో షకీల్‌‌ అహ్మద్‌‌ (10), సమయ్‌‌ శ్రీవాస్తవ (5 నాటౌట్‌‌) డిఫెన్స్‌‌కు వెళ్లి విజయాన్ని కాసేపు అడ్డుకున్నారు. 

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్‌‌: 20 ఓవర్లలో 160/7 (మహ్మద్‌‌ హారిస్‌‌ 66, ఫర్హాన్‌‌ 29, ఫైజల్‌‌ 3/34, కలీమ్‌‌ 3/31). ఒమన్‌‌: 16.4 ఓవర్లలో 67 ఆలౌట్‌‌ (హమ్మద్‌‌ మీర్జా 27, ఫహీమ్‌‌ అష్రాఫ్‌‌ 2/6, సూఫియాన్‌‌ ముకీమ్‌‌ 2/7).